ఉగ్రవాదం నుంచి వీర సైనికుడిగా.. నజీర్ వానీ అరుదైన ప్రస్థానం
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:47 PM
కశ్మీర్ లోయలో ఒకప్పుడు ఉగ్రవాద బాట పట్టి.. ఆ తర్వాత భారత సైన్యంలో చేరి దేశం కోసం ప్రాణాలర్పించి నజీర్ అహ్మద్ వానీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. 2018 నవంబర్ 25న షోపియాన్ జిల్లాలోని బటగుండ్ వద్ద జరిగిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీ (38) వీరమరణం పొందారు.
ఇంటర్నెట్ డెస్క్: కశ్మీర్ లోయలో ఒకప్పుడు ఉగ్రవాద బాట పట్టి.. ఆ తర్వాత భారత సైన్యంలో చేరి దేశం కోసం ప్రాణాలర్పించి నజీర్ అహ్మద్ వానీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. 2018 నవంబర్ 25న షోపియాన్ జిల్లాలోని బటగుండ్ వద్ద జరిగిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీ (38) వీరమరణం పొందారు. ఆయన త్యాగానికి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా ఆయన జీవిత విశేషాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. తన 2024 పుస్తకం 'ఏ జనరల్ రెమినిసెస్: ఏ లైఫ్ అండర్ ఫైర్ ఇన్ కశ్మీర్'లో వానీ ప్రస్థానాన్ని దువా విపులంగా నమోదు చేశారు.
కుల్గాం జిల్లా చక్ అష్ముజి గ్రామంలో నజీర్ అహ్మద్ జన్మించారు. అతని తండ్రి సోనుల్లా వ్యవసాయంతో పాటు చిన్న దాబా నడిపేవారు. నజీర్ చిన్నతనంలో తివాచీలు నేస్తూ జీవనం సాగించారు. పండిట్ శుభన్ జీ అనే కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయుడి బోధనలు, గ్రామంలోని మాజీ సైనికుడు చెప్పిన యుద్ధ గాథలు ఆయన్ను ప్రభావితం చేశాయి. 'పెద్దయ్యాక నేను కూడా యుద్ధాలు చేస్తాను' అని నాడు బాలుడిగా వానీ అన్న మాటలు ఆ తర్వాత నిజమయ్యాయి. 1990వ దశకంలో కశ్మీర్లో అశాంతి నెలకొన్న వేళ తొలుత ఉగ్రవాద సంస్థల వైపు ఆకర్షితుడయ్యాడు. కొంతకాలం నజీర్ భారత్ సైనికులకు వ్యతిరేకంగా పని చేశారు. అనంతరం వివిధ'ఇఖ్వాన్' ద్వారా సాధారణ ప్రజల్లోకి వచ్చారు. 2004లో టెరిటోరియల్ ఆర్మీ (162వ బెటాలియన్ - జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ఫంట్రీ)లో చేరారు.
రాష్ట్రీయ రైఫిల్స్‌తో కలిసి పలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్న నజీర్.. తన ధైర్యసాహసాలకు గుర్తింపుగా రెండుసార్లు 'సేనా మెడల్' అందుకున్నారు. బటగుండ్ ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడినా వెనుకడుగు వేయకుండా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టి, సహచరులను కాపాడుతూ ఆయన వీరమరణం పొందారు. మరణానంతరం అత్యున్నత శౌర్య పురస్కారం 'అశోకచక్ర' లభించగా, జమ్మూకశ్మీర్ నుంచి ఈ గౌరవం పొందిన తొలి వ్యక్తిగా నజీర్ అహ్మద్ వానీ చరిత్రలో నిలిచారు.
ఇవి కూడా చదవండి:
భారీ లాభాల్లో దేశీయ సూచీలు.. 25,800 దాటిన నిఫ్టీ..
ఆకాశంలో వెండివెన్నెల.. హిమాలయాల మధ్య చంద్రోదయం.. వీడియో వైరల్..