Share News

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది

ABN , Publish Date - Sep 06 , 2026 | 06:08 AM

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది అని, పిల్లలు చదువుకు దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గురువులదేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు....

విద్యా వ్యవస్థకు  పాఠశాల విద్యే పునాది

పిల్లలు చదువుకు దూరం కాకుండా చూడాల్సింది గురువులే

  • జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ముర్ము

  • తెలంగాణ నుంచి బొంపెల్లి భవాని, కీర్తి చంద్ర సాహులకు అందజేత

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది అని, పిల్లలు చదువుకు దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గురువులదేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో శనివారం నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన 82 మందికి ఆమె పురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ కీర్తిచంద్ర సాహు, కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రిలో వైద్య విద్య అధ్యాపకులు డాక్టర్‌ అరుణ్‌బాబు, విజయనగరానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజేష్‌ కౌలూరి కూడా రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు. 2026కి గాను పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం నుంచి 48 మంది ఉపాధ్యాయులు, ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్‌ల నుంచి 21 మంది అధ్యాపకులు, ఫ్యాకల్టీ సభ్యులు, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి 13 మంది నైపుణ్య శిక్షకులు కలిపి మొత్తం 82 మంది అవార్డుకు ఎంపికయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నలుగురు ఉన్నారు. వీరితోపాటు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని మాయబందర్‌లో పీఎం శ్రీ గవర్నమెంట్‌ మోడల్‌ సీనియర్‌ సెకండరీ(జీఎంఎ్‌సఎస్‌) స్కూల్‌లో పీజీటీ ఇంగ్లీష్‌ టీచర్‌గా పని చేస్తున్న తెలుగు వ్యక్తి జెల్లి ప్రకాశ్‌రావుకు కూడా జాతీయ ఉపాధ్యాయ అవార్డు లభించింది. కాగా, అవార్డుల ప్రదానం అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపరిచిన సమాన అవకాశాల లక్ష్యాన్ని సాకారం చేసుకోవడానికి విద్యే సాధనమని అన్నారు. ఉపాధ్యాయుల కృషితో ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్‌(బడి మానేేస వారి) రేటు దాదాపు సున్నాకు చేరిందన్నారు. ప్రాథమిక తరగతుల్లోనే పిల్లల మేధో, శారీరక, నైతిక వికాసంపై ఉపాధ్యాయులు శ్రద్థ పెట్టడం ద్వారా భావితరాలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. దేశంలో ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యకు దూరం కాకుండా ఉండేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

ఆటలు, డిజిటల్‌ సాధనాలతో పాఠాలు..

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి మండల పరిషత్‌ ప్రాథమిక(ఎంపీపీ) బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు భవాని ఆటల ఆధారిత, డిజిటల్‌ సాధనాల ద్వారా ప్రీ ప్రైమరీ విద్య బోధనకు కృషి చేశారు. ఆమె కృషి వల్ల విద్యార్థుల నమోదు 40 నుంచి 130కి పెరిగింది. ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ కీర్తి చంద్ర సాహు పరిశోధన, బోధన, విద్యా నాయకత్వ రంగాలలో కీలకమైన సహకారాన్ని అందించారు. ఆయన పరిశోధనలు వాతావరణ మార్పుల అంచనాలు, వాతావరణ నమూనాలు వంటి అంశాల్లో ఎంతగానో ఉపయోగపడ్డాయి. మంగళగిరి ఎయిమ్స్‌లో బోధకుడు అరుణ్‌బాబు పీడియాట్రిక్స్‌ బోధన, పరిశోధనలో సరికొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లారు. విజయనగరం జిల్లా చనుమల్లు పేటలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రాజేష్‌ బోధనలో ఏఐ సాంకేతికతను సమర్థంగా వినియోగించారు.


పిల్లల స్క్రీన్‌ టైమ్‌’ తగ్గేలా చెయ్యండి : ప్రధాని మోదీ

పిల్లల్లో స్ర్కీన్‌ టైమ్‌( మొబైల్‌, టీవీ స్ర్కీన్‌లు చూసే సమయం) సమస్య ఆందోళనకరంగా మారిందని, పిల్లల స్ర్కీన్‌ టైమ్‌ను తగ్గించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రధాని మోదీ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారితో మోదీ తన నివాసంలో సమావేశమయ్యారు. స్ర్కీన్‌ టైమ్‌ సమస్య ఆందోళనకరంగా మారిందని ఈ సందర్భంగా అన్నారు. పిల్లలు మొబైల్‌, టీవీ స్ర్కీన్‌ల ముందు ఎంత సమయం గడుపుతున్నారు? మొబైల్‌ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారా ? అనే విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాలపై ఆసక్తిని పెంచడం ద్వారా పిల్లల స్ర్కీన్‌ వినియోగాన్ని తగ్గించవచ్చని సూచన చేశారు. సిలబ్‌సకు సంబంధించిన జ్ఞానాన్ని అందించడమే కాకుండా, పిల్లలలో ‘శ్రమ గౌరవం’ వంటి విలువలను పెంపొందించడానికి కృషి చేయాలని ఉపాధ్యాయులను కోరారు. డ్రగ్స్‌ సమస్యను ప్రస్తావిస్తూ.. పిల్లలలో వచ్చే మార్పుల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌‌రెడ్డి

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 06:08 AM