Share News

‘నారీశక్తి’ని అడ్డుకోలేరు!

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:25 AM

లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలుకు ఎదురయ్యే ఆటంకాలన్నిటినీ తొలగిస్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.

‘నారీశక్తి’ని అడ్డుకోలేరు!
modi

  • లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 1/3 కోటా ఇచ్చి తీరుతాం

  • ఎదురయ్యే ప్రతి అడ్డంకినీ అధిగమిస్తాం

  • ‘ఎక్స్‌’లో వీడియో పోస్టుచేసిన మోదీ

  • యూపీ కోసమే ఎమ్మెల్యేల పరిమితి పెంపు

  • పరిమితి 650కి పెంచే ప్రతిపాదన అందుకే..

  • 403 నుంచి 605కు చేరనున్న స్థానాలు

  • సాధికారతకు మాటిచ్చాం.. కట్టుబడి ఉన్నాం

  • ఎదురయ్యే ప్రతి అడ్డంకినీ అధిగమిస్తాం.. ‘ఎక్స్‌’లో మోదీ

  • దశాబ్దాల ఎదురుచూపులకు తెర: అమిత్‌షా

న్యూఢిల్లీ, నవంబరు 28: లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలుకు ఎదురయ్యే ఆటంకాలన్నిటినీ తొలగిస్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ‘నారీశక్తి’ బిల్లును రాజకీయ పార్టీలేవీ అడ్డుకోలేవని తేల్చిచెప్పారు. నారీశక్తి సాధికారతకు మాటిచ్చామని.. దానిని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మహిళా బిల్లుతో ముడిపడిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు (132వ రాజ్యాంగ సవరణ బిల్లు) ఆమోదం కోసం సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని శనివారం ‘ఎక్స్‌’లో ఓ వీడియో పోస్టు చేశారు. ‘నారీశక్తి సాధికారతకు మాది మొక్కవోని దృఢసంకల్పం. ప్రతి మహిళాకూ హామీ ఇస్తున్నాను. మీకు చట్టసభల్లో రిజర్వేషన్‌ కల్పనకు ఎదురయ్యే ప్రతి అడ్డంకినీ కచ్చితంగా తొలగిస్తాం. ఈ బిల్లుకు మద్దతిస్తున్నవారిలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. మా ధైర్యాన్ని దెబ్బతీయలేరు. మా సంకల్పం మరింత దృఢంగా ఉంది. మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తున్న పార్టీలు..చట్టసభల్లో వారి భాగసామ్యాన్ని మరింత పెంచకుండా అడ్డుకోజాలవు. కొంత సమయం పట్టినా ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కోసం దశాబ్దాలుగా పోరాటం జరుగుతోంది. దానిని సఫలం చేసేందుకు ప్రయత్నిస్తున్నవారిలో నేనూ ఒకడిని. చాలా మంది మహిళలు నన్ను అడుగుతూ వస్తున్నారు. ఈ దేశ మహిళల ఆశీర్వాద బలం వంద శాతం మాపై ఉందని నాకు తెలుసు’అని పేర్కొన్నారు.


amithmodi1.jpgపార్టీలన్నీ మద్దతివ్వాలి: అమిత్‌షా

పునర్విభజన బిల్లుకు రాజకీయ పార్టీలన్నీ మద్దతివ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పిలుపిచ్చారు. 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ శుక్రవారం ఆమోదముద్ర వేసిందని.. దశాబ్దాలుగా దేశ మహిళల ఎదురుచూపులకు ముగింపు పలికిందని తెలిపారు. ఇది పరిపాలనలో మహిళలను శక్తిమంతమైన భాగస్వాములుగా మార్చే చరిత్రాత్మక కార్యక్రమంగా అభివర్ణించారు. చట్టసభల్లో శక్తిమంతమైన పాత్ర కల్పించడానికి మోదీ సర్కారు కట్టుబడి ఉందని ‘ఎక్స్‌’లో తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కేవలం ఓ శాసనసంబంధ సంస్కరణ మాత్రమే కాదని.. సమ్మిళిత ప్రజాస్వామ్యం, జాతి నిర్మాణంలో మహిళలకు శక్తిమంతమైన పాత్ర కల్పించే నిర్ణయాత్మక సంకల్పమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అన్నారు. ‘మహిళా సాధికారత మోదీ గ్యారెంటీ’ అని ‘ఎక్స్‌’లో తెలిపారు. మహిళల ఆత్మగౌరవం, హక్కులు కాపాడడానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అనిల్‌ బలూనీ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

Updated Date - Nov 29 , 2026 | 04:38 AM