Share News

ఘోర ప్రమాదం.. లోయలో కారు పడి ఐదుగురి మృతి..

ABN , Publish Date - May 21 , 2026 | 08:45 PM

ఉత్తరాఖండ్‌ నైనిటాల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కైంచి ధామ్ సమీపంలో ప్రమాదవశాత్తూ లోయలోకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతిచెందారు.

ఘోర ప్రమాదం.. లోయలో కారు పడి ఐదుగురి మృతి..
Nainital Road Accident

ఉత్తరాఖండ్‌: నైనిటాల్‌ జిల్లా కైంచి ధామ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ లోయలోకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా.. మరొకరు డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. ఖతీమాకు చెందిన ఓ కుటుంబం ప్రసిద్ధ కైంచి ధామ్ ఆలయానికి వెళ్తోంది. అయితే, వారు ప్రయాణిస్తున్న కారు.. ధైలా గ్రామం వద్దకు రాగానే శానిటోరియం-రతిఘాట్ బైపాస్ రోడ్డుపై అదుపు తప్పింది. దీంతో దాదాపు 500 మీటర్ల లోయలో పడిపోయింది.


ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసు సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను రక్షించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులను భూపేంద్ర సింగ్ చుఫాల్ (48), సీమా కైదా చుఫాల్ (45), వాసు చుఫాల్ (19), రవి చుఫాల్ (12), డ్రైవర్ అనుజ్ కుమార్ మిశ్రా (34)గా పోలీసులు గుర్తించారు. బైపాస్ మార్గంలో వాహనం అదుపు తప్పడం వల్లే ప్రమాదం జరిగిందని నైనిటాల్ ఎస్పీ జగదీశ్ చంద్ర తెలిపారు.


ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కైంచి ధామ్ బైపాస్ మార్గంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఆ రహదారిలో పలుచోట్ల భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఐదుగురు మృతిచెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

సారా టెండూల్కర్‌పై బాడీ షేమింగ్ పోస్ట్.. ఆమె స్పందన ఏంటంటే..

హౌరా స్టేషన్‌లో మిథిలా ఎక్స్‌ప్రెస్‌కి నిప్పు వెనుక భారీ కుట్ర!

Updated Date - May 21 , 2026 | 08:49 PM