మైసూర్ శాండల్ సోప్ ప్రచారకర్తగా తమన్నా... కన్నడిగుల ఫైర్
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:54 PM
మైసూరు శాండల్ సబ్బులు, ఆ సంస్థకు చెందిన ఇతర ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి తమన్నా భాటియాను కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమె ప్రస్థానం మంగళవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. తమన్నా రెండేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.
బెంగళూరు, ఫిబ్రవరి 10: కర్ణాటకకు చెందిన 108ఏళ్ల వారసత్వ సంపద అయిన 'మైసూర్ శాండల్ సోప్' గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా.. ఈ ఉత్పత్తులకు కొత్త బ్రాండ్ అంబాసిడర్ వచ్చింది. 'కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(KSDL)' బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి తమన్నా భాటియాను(Tamannaah) ఎంపిక చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆమె రెండేళ్ల పాటు మైసూర్ శాండల్ సోప్, ఇతర ఉత్పత్తులకు అంబాసిడర్‌గా కొనసాగనున్నారు. ఈ ఒప్పంద కాలంలో ఆమె.. ఇతర ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఎలాంటి ఉత్పత్తులకూ ప్రచారం కల్పించకూడదు.
ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్(MB Patil) మంగళవారం మీడియాతో మాట్లాడారు. చారిత్రక మైసూర్ శాండల్ సోప్‌ను సరికొత్త, ఆధునిక రూపురేఖలతో తిరిగి మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. యువతను ఆకట్టుకోవడం ద్వారా కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్‌లో మరింత ప్రాచుర్యం కల్పించే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాటిల్ తెలిపారు. సోషల్ మీడియాలో 30 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న తమన్నాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం ద్వారా.. ముఖ్యంగా ఉత్తర భారతదేశ మార్కెట్లలో తమ కంపెనీ ఉత్పత్తుల డిమాండ్ పెంచవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి ఈ సంస్థ వార్షిక టర్నోవర్‌ను రూ.5,000 కోట్లకు పెంచడమే లక్ష్యమని మంత్రి పాటిల్ తెలిపారు.
గతేడాది కూడా తమన్నాను రూ.6.2 కోట్ల ఒప్పందంతో.. బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై వివాదం చెలరేగింది. కన్నడ నటీనటులను కాదని తమన్నాకు అవకాశం ఇవ్వడంపై పలు కన్నడ సంఘాలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఎంపి కె.సుధాకర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కన్నడ వ్యతిరేక మనస్తత్వం కలిగినదని ఆయన విమర్శించారు. 'కన్నడ నుంచి చాలా మంది తారలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని ప్రఖ్యాత అంతర్జాతీయ బ్రాండ్ మైసూర్ శాండల్ సబ్బుకు(Mysore Sandal Soap) అంబాసిడర్‌గా వేరే రాష్ట్రం, వేరే భాషకు చెందిన సినీ నటిని నియమించింది. అంతేకాక ఆమెకు కోట్లాది రూపాయలు చెల్లించింది. ఇది కాంగ్రెస్ పార్టీ కన్నడ వ్యతిరేక మనస్తత్వానికి మరో నిదర్శనం' అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఈ వార్తలూ చదవండి:
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్