అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడమే నా బాధ్యత: అన్నామలై
ABN , Publish Date - Apr 03 , 2026 | 07:35 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నామలై స్పందించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడమే తన పాత్ర అని, అది తన బాధ్యత అని చెప్పారు.
కన్నూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నామలై (Annamalai) స్పందించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడమే తన పాత్ర అని, అది తన బాధ్యత అని చెప్పారు. కన్నూరులో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారసభలో అన్నామలై పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతానికి తమిళనాడులో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం కొనసాగించడమే తనకు అప్పగించిన బాధ్యత అని చెప్పారు.
'ప్రస్తుతం పుదుచ్చేరి, కేరళలో ఈనెల 7వ తేదీ వరకూ ప్రచారం ఉంటుంది. 7వ తేదీ నుంచి 23 వరకూ తమిళనాడులో బీజేపీ, ఎన్డీయే అభ్యర్థులందరి తరఫున ప్రచారంలో పాల్గొంటాను. పార్టీ అప్పగించిన బాధ్యత ఇది. దానికి పూర్తి న్యాయం చేస్తాను' అని అన్నామలై చెప్పారు. కన్నూరులో బీజేపీ అభ్యర్థి సి.రఘునాథ్ తరఫున ఆయన ప్రస్తుతం ప్రచారం సాగిస్తున్నారు.
ఎన్డీయే కూటమితో సంప్రదింపుల అనంతరం తమిళనాడులో పోటీ చేసే 27 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం విడుదల చేసింది. తమిళనాడు బీజేపీలో 'సింహం'గా పేరున్న కె.అన్నామలైకి ఈ జాబితాలో చోటులేకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అన్నామలై మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో అభినందనలు తెలిపారు. డీఎంకేపై విమర్శలు గుప్పించారు. బీజేపీ కార్యకర్తగా బీజేపీ, ఎన్డీయే అభ్యర్థుల విజయానికి పాటుపడతానని చెప్పారు. పార్టీ అభ్యర్థుల జాబితాను కూడా ఆయన తన ట్వీట్‌కు జతచేశారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఏప్రిల్ 23న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
అన్నామలైకి బీజేపీ నో టిక్కెట్.. కారణం ఏమిటంటే..
తమిళనాడు ఎన్నికలు.. 27 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్