అప్పుడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేరు.. అస్సాం ప్రచారంలో అమిత్‌షా
ABN , Publish Date - Apr 03 , 2026 | 07:02 PM
చొరబాటుదారులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉమ్మడి పౌరస్మృతితో అడ్డుకునే వీలుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. అస్సాంలోని గోల్‌పాడాలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా పాల్గొన్నారు.
గువాహటి: చొరబాటుదారులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉమ్మడి పౌరస్మృతి (UCC)తో అడ్డుకునే వీలుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. అస్సాంలోని గోల్‌పాడాలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడుతూ, తిరిగి తాము అధికారంలోకి వస్తే అక్రమ చొరబాట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
గిరిజనాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సమగ్ర మ్యాప్ సిద్ధం చేశారని అమిత్‌షా తెలిపారు. దీనిని ముందుకు తీసుకువెళ్లి, సమర్ధవంతంగా అమలు చేయాలంటే బీజేపీకే ప్రజలు ఓటు వేయాలని కోరారు. మోదీ నాయకత్వంలో తొలిసారి గిరిజన మహిళ దేశ అధ్యక్షురాలు అయిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ ఆదివాసీ మహిళలను రాష్ట్రపతి చేయలేదని, మోదీ వచ్చాక పరిస్థితి మారిందని, ద్రౌపది ముర్ము దేశానికి తొలి పౌరురాలు అయ్యారని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో యూసీసీని బలవంతంగా రుద్దుతున్నారంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. యూసీసీ నుంచి ఆదివాసీ ప్రాంతాలను మినహాయిస్తామని చెప్పారు.
పొరుగున్న ఉన్న మేఘాలయాలో చొరబాటుదారులు ఇటీవల గరో హిల్స్ అటానమస్ జిల్లా కౌన్సిల్‌లో గిరిజన మహిళలను పెళ్లాడి రాజకీయ పలుకుబడిని సంపాదించే ప్రయత్నం చేశారని, ఇది ఉద్రిక్తతలకు దారితీసిందని అమిత్‌షా చెప్పారు. అస్సాంలో తమకు మరో ఐదేళ్లు అధికారం ఇస్తే యూజీసీని అమలు చేయడంతో పాటు చొరబాటుదారుల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అస్సాంలో శాంతిని బీజేపీ పునరుద్ధరించిందని, కాంగ్రెస్ తిరిగి వచ్చినా, కొన్ని సీట్లలో నెగ్గినా కూడా తిరిగి రాష్ట్రంలో అస్థిరత నెలకొంటుందని హెచ్చరించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
అన్నామలైకి బీజేపీ నో టిక్కెట్.. కారణం ఏమిటంటే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..