Share News

15 వేల మందిని చంపాలనుకున్నా.. మొహర్రం వేడుకలో మాత్రలతో పట్టుబడిన ముంబై వ్యక్తి వాంగ్మూలం..

ABN , Publish Date - Jun 28 , 2026 | 10:59 AM

మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ విషాదం త్రుటిలో తప్పింది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

15 వేల మందిని చంపాలనుకున్నా.. మొహర్రం వేడుకలో మాత్రలతో పట్టుబడిన ముంబై వ్యక్తి వాంగ్మూలం..
Mumbai Muharram procession

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ విషాదం త్రుటిలో తప్పింది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు 14,900 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు క్యాప్సూల్స్‌ను నొప్పి నివారణ మాత్రలు, రోగనిరోధక శక్తిని పెంచే మందులని చెప్పి ప్రజలకు అందజేశాడు (Mumbai Muharram procession).


ఆ క్యాప్సూల్స్‌లో జింక్ ఫాస్ఫైడ్ అనే అత్యంత విషపూరిత రసాయనం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ రసాయనం సాధారణంగా ఎలుకల మందులో ఉపయోగిస్తారు. ఈ క్యాప్సూల్స్ తీసుకున్న 11 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సకాలంలో హాస్పిటల్‌లో చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డారు. తాను సుమారు 15 వేల మందిని చంపాలనుకున్నట్టు నిందితుడు ఫయాజ్ ప్రేమ్‌జీ చెప్పినట్లు అధికారులు వెల్లడించారు (Poison capsules).


అతడు ముందుగానే 30 వేల ఖాళీ క్యాప్సూల్స్, 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్ (Zinc phosphide) ఆర్డర్ చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. అతడి ఉద్దేశం, ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ భారీ ప్రమాదాన్ని ముగ్గురు మహిళా వాలంటీర్లు పసిగట్టి అడ్డుకోగలిగారు. నిందితుడు అనుమానాస్పదంగా క్యాప్సూల్స్ పంచుతుండటాన్ని గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం లౌడ్‌స్పీకర్ ద్వారా ప్రజలకు ఆ క్యాప్సూల్స్ తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.. పలు సైనిక కేంద్రాలు ధ్వంసం..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఇవే..

Updated Date - Jun 28 , 2026 | 12:06 PM