సీటు కోసం గొడవ.. కదులుతున్న రైలు నుంచి దివ్యాంగుడిని తోసేసిన వ్యక్తి.!
ABN , Publish Date - Aug 20 , 2026 | 08:40 PM
ముంబై లోకల్ రైలులో దారుణం చోటుచేసుకుంది. దివ్యాంగుల కోసం కేటాయించిన కోచ్‌లో ప్రయాణిస్తున్న 62 ఏళ్ల వ్యక్తి కదులుతున్న రైలు నుంచి కిందపడిపోయి మృతి చెందాడు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబై లోకల్ రైలులో దారుణం చోటుచేసుకుంది. దివ్యాంగుల కోసం కేటాయించిన కోచ్‌లో ప్రయాణిస్తున్న 62 ఏళ్ల దివ్యాంగుడు రైలు నుంచి కిందపడిపోయి మృతి చెందాడు. సీటు విషయంలో మరో ప్రయాణికుడితో జరిగిన గొడవే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం మహిమ్, బాంద్రా రైల్వే స్టేషన్ల మధ్య చర్చ్‌గేట్-బోరివలి లోకల్ రైలులో ఈ ఘటన జరిగింది. కదులుతున్న రైలు నుంచి కిందపడటంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి.
సీటు విషయంలో గొడవ
పోలీసుల వివరాల ప్రకారం.. బాధితుడు దివ్యాంగుల కోసం కేటాయించిన కోచ్‌లో ప్రయాణిస్తున్నాడు. అదే కోచ్‌లో ఉన్న మరో ప్రయాణికుడితో సీటు విషయంలో అతనికి వాగ్వాదం జరిగింది. మాటలతో మొదలైన గొడవ క్రమంగా తీవ్రరూపం దాల్చింది. ఈ సమయంలో బాధితుడిని రైలు నుంచి బయటకు తోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో బాంద్రా వెస్ట్‌లోని భాభా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. గాయాల తీవ్రత కారణంగా అతను మృతి చెందాడు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ ఘటనకు సంబంధించి అమ్జద్ సఫ్రుద్దీన్ షేక్ (48) అనే వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడు పోలీసులకు చెప్పిన కారణం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైలు కంపార్ట్‌మెంట్‌లోకి ఓ కాకి వచ్చిందని, దాన్ని బయటకు తరిమేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బాధితుడిని తాకడంతో ఆయన రైలు నుంచి కిందపడిపోయారని షేక్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ వాదనను పోలీసులు దర్యాప్తులో పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఇతర ప్రయాణికుల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించి అసలు ఏం జరిగిందనే విషయాన్ని నిర్ధారించే పనిలో అధికారులు ఉన్నారు.
Also Read:
ఫ్రస్ట్రేషన్‌లో అలా అన్నా.. సారీ.. భారత ఆర్మీకి యువతి క్షమాపణ
ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లీనే బెటర్: ఏబీ డివిలియర్స్