Share News

ఫ్రస్ట్రేషన్‌లో అలా అన్నా.. సారీ.. భారత ఆర్మీకి యువతి క్షమాపణ

ABN , Publish Date - Aug 20 , 2026 | 07:21 PM

లద్దాఖ్‌లో ఆర్మీ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన 25 ఏళ్ల యువతి తాజాగా క్షమాపణలు చెప్పింది.

ఫ్రస్ట్రేషన్‌లో అలా అన్నా.. సారీ.. భారత ఆర్మీకి యువతి క్షమాపణ
Gen Z Woman Apologizes to Indian Army

ఇంటర్నెట్ డెస్క్: లద్దాఖ్‌లో ఆర్మీ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన 25 ఏళ్ల యువతి తాజాగా క్షమాపణలు చెప్పింది. గంటల తరబడి వేచి ఉండటంతో ఏం జరుగుతోందో తెలియని ఫ్రస్ట్రేషన్‌లో అలా మాట్లాడానని వివరణ ఇచ్చింది. అలా మాట్లాడినందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

‘నాకు భారత ఆర్మీ అంటే ఎంతో గౌరవం. నా వ్యాఖ్యల వల్ల వారు బాధపడతారని అస్సలు అనుకోలేదు. ఆ రోజు మేము లద్దాఖ్ నుంచి ఢిల్లీకి వస్తున్నాము. ఆ సమయంలో అక్కడ నుంచి వీఐపీ ఎవరో వెళతారని అనుకోలేదు. ఆ రోజు ఉదయం మేము చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఎంత సేపు పడుతుందని ఒక సైనికుడిని అడగ్గా ఇంకో గంట సేపు పడుతుందని చెప్పారు’ అని అప్పుడు జరిగిన ఘటన గురించి తెలిపింది. ఆ తరువాత మరో గంట దాటినా రోడ్డును మూసే ఉంచారని చెప్పింది. ఆ సమయంలో యువతి అక్కడి సిబ్బందిపై విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.


అయితే, వీడియోలో కనిపించిన దాని కంటే అక్కడి పరిస్థితి సంక్లిష్టంగా ఉందని యువతి చెప్పింది. ‘అప్పటికే ఆరు గంటల నుంచి వేచి చూస్తున్నాము. ఈ లోపు కాస్త దూరంలో ఏదో గొడవ మొదలైంది. పోలీసులు, ఆర్మీ, పబ్లిక్ మధ్య ఏదో వాగ్వాదం జరుగుతోంది. నేను చాలా సేపు సహనంగానే ఉన్నాను. ఆరు గంటలుగా అక్కడే ఉండిపోయాము. వీఐపీ రాకపోకల వల్ల మాకు బాత్రూమ్‌కు వెళ్లే ఛాన్స్ కూడా లేకపోయింది. దీంతో, మాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. మేము పన్నులు చెల్లిస్తున్నాము. అంతా చట్టప్రకారం చేస్తున్నాము. అయినా మాకే ఇలా ఎందుకు జరుగుతోంది అని అనిపించింది. ఏదేమైనా నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు’ అని విచారం వ్యక్తం చేసింది. వీడియో వైరల్ అయ్యాక తాను డిప్రెషన్‌లో కూరుకుపోయానని, అంతలా విమర్శలు వస్తాయని అనుకోలేదని కామెంట్ చేసింది. అయితే, మీడియా వేదికగా తాను దేశానికి, స్థానిక పోలీసులకు, ఆర్మీకి క్షమాపణ చెబుతున్నానని పేర్కొంది. తన వ్యాఖ్యలు అంతమందిని బాధపెట్టినందుకు తలదించుకుంటున్నానని వ్యాఖ్యానించింది. ఆర్మీ సిబ్బంది, పోలీసులు తనను సోదరిగా భావించి క్షమించాలని కోరింది.


ఈ వార్తలను కూడా చదవండి:

పార్క్‌లో భారీ కొండచిలువ హల్‌చల్.. వీడియో వైరల్

ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా.. గంటకు 45.6 కిలోమీటర్ల వేగంతో చైనా 'సూపర్‌మ్యాన్' రోబో..

Updated Date - Aug 20 , 2026 | 08:01 PM