Share News

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ఫ్రెండ్లీ స్పైడర్ మ్యాన్ వీడియో వైరల్..

ABN , Publish Date - Jul 06 , 2026 | 09:43 PM

మహారాష్ట్రలో భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీటమునిగాయి. థానే జిల్లా భివండి, పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో స్పైడర్ మ్యాన్ వేషధారణలో అందరికీ సహాయం చేస్తున్న ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ఫ్రెండ్లీ స్పైడర్ మ్యాన్ వీడియో వైరల్..
Maharashtra Heavy Rains

ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలకు థానే, ముంబై, పుణె సహా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. సుమారు 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలూ జరిగాయి. మరోవైపు వానలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో అనేక మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. థానే జిల్లా భివండి, పరిసర ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే, ఓ స్థానిక యువకుడు చేసిన పని ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించింది. స్పైడర్ మ్యాన్ వేషధారణలో అందరికీ సహాయం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


భివండిలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిలిచింది. ఆ ప్రాంతంలోని రోడ్లన్నీ పెద్దపెద్ద గోతులతో ఉన్నాయి. కొన్ని రోజులుగా వర్షపు నీటితో నిండిన గుంతల్లో ప్రయాణిస్తున్న స్థానికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇది గమనించిన షాదాబ్ మోమిన్ అనే స్థానిక యువకుడు తోటి వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. 'ఫ్రెండ్లీ స్పైడర్ మ్యాన్' పేరుతో రోడ్డుపై వెళ్తున్న వారికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి.. వాహనదారులు గుంతల్లో చిక్కుకుని ప్రమాదాలకు గురి కాకుండా సరైన మార్గాన్ని చూపిస్తూ మంచి మనసు చాటుకున్నాడు. గుంతల్లో దిగబడిన వాహనాలను ముందుకు నెడుతూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా అండగా నిలబడుతున్నాడు.


ఎంతో మంది చిన్నారులకు స్పైడర్ మ్యాన్ ఫేవరెట్ సూపర్ హీరో కావడంతో రోడ్డుపై వెళ్తున్న చిన్నారులు అతని వద్దకు వస్తున్నారు. వారినీ తన భుజాలపై మోస్తూ రోడ్డు దాటిస్తున్నాడు ఆ యువకుడు. దీంతో స్థానికులంతా షాదాబ్ మోమిన్‌ను 'భివండి స్పైడర్ మ్యాన్' అని పిలవడం మొదలుపెట్టారు. ఇందుకు తగ్గట్టుగానే చిత్రవిచిత్ర స్టంట్లు చేస్తూ భివండి వాసులను అతను అలరిస్తున్నాడు. కొంతమంది యువకులు అతని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. షాదాబ్ మోమిన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ధైర్యవంతులైన యువకులంతా ఇలాగే తోటి వారికి సహాయం చేయాలని నెట్టింట చర్చించుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బామ్మ డెడ్‌లిఫ్ట్.. వీడియో వైరల్

పశువుల కాపరిపై సింహం దాడి.. వీడియో వైరల్

Updated Date - Jul 06 , 2026 | 09:46 PM