26/11 ముంబయి ఉగ్రదాడులకు 18 ఏళ్లు.. నివాళులర్పించిన విదేశాంగ మంత్రి జయశంకర్
ABN , Publish Date - Nov 26 , 2026 | 09:37 AM
నేటితో 26/11 ముంబయి ఉగ్రవాద దాడులు జరిగి 18 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ.. విదేశాంగ మంత్రి జయశంకర్ నివాళులర్పించారు.
ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 26, 2008న రాత్రి సముద్రమార్గం ద్వారా ముంబయి నగరంలోకి చొరబడ్డ 10 మంది ఉగ్రవాదులు.. నగరంలో భీకర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 166 మంది మరణించగా.. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశాన్ని కుదిపేసిన ఈ ఉగ్రవాద దాడి జరిగి 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆనాటి భీకర దాడిలో మరణించిన అమాయకులకు, ఆ దాడిని ధైర్యంగా ఎదుర్కొని ప్రాణాలు విడిచిన భద్రతాసిబ్బందికి విదేశాంగ మంత్రి జయశంకర్ నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని అన్నీ రూపాల్లో పూర్తిగా అణచివేయడానికి ప్రభుత్వం అన్నీ రకాల చర్యలు చేపడుతోందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
నవంబర్ 26 ముంబయి దాడి విషాద ఘటన మిగిల్చిన గాయాలు ఇంకా నగరవాసులను వెంటాడుతూనే ఉన్నాయి. తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్, నారిమన్ హౌస్‌లో మూడు రోజుల పాటు జరిగిన కాల్పుల తాలూకు తూటాల గుర్తులు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఉగ్రవాది కసబ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తుకారం ఓంబ్లే విగ్రహం, ముంబయి వీధులు.. ఆ దారుణమైన దాడులను గుర్తుచేస్తూ ఉంటాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. కసబ్‌ను అరెస్ట్ చేశారు. కాగా 2010 మేలో న్యాయస్థానం కసబ్‌కు మరణశిక్ష విధించగా.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య 2012లో ఉరి తీశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి