ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా పేలిన ఏడు గ్యాస్ సిలిండర్లు
ABN , Publish Date - Oct 08 , 2026 | 08:04 PM
ముంబై ములుంద్ ఈస్ట్‌లోని టాటా కాలనీలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ధారావి పునరావాసంలో భాగంగా నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌లోని కార్మికుల క్యాంప్‌లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో క్యాంప్‌లో ఉంటున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.
ముంబై: ములుంద్ ఈస్ట్‌లోని టాటా కాలనీలో ఇవాళ (గురువారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ధారావి పునరావాసంలో భాగంగా నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌లోని కార్మికుల క్యాంప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ధారావి నుంచి తరలించిన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)కు చెందిన ప్రాజెక్ట్ అఫెక్టెడ్ పర్సన్స్ (PAP) పథకంలో భాగంగా ఈ నిర్మాణం జరుగుతోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు ఏడు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు డీసీపీ అభయ్‌సిన్హా దేశ్‌ముఖ్ తెలిపారు. అయితే, అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్యాంప్‌లో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ మరణించలేదని ఆయన చెప్పుకొచ్చారు.
సమాచారం అందిన వెంటనే సుమారు 15 ఫైర్ టెండర్లు, అంబులెన్సులు, నవ్‌ఘర్ పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు, ఘటనాస్థలంలో సీనియర్ పోలీస్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. దసరా వేళ దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్..
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..