Share News

రాఘవ్ చద్దాకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్

ABN , Publish Date - May 03 , 2026 | 07:34 PM

ఆమ్ ఆద్మీ పార్టీని వీడిన ఎంపీలపై పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లేందుకు అపాయింట్‌మెంట్ కోరారు.

రాఘవ్ చద్దాకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్
Droupadi Murmu and Raghav Chadha

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీని వీడిన ఎంపీలపై పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. ఇందుకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. మే 5న అపాయింట్‌మెంట్ ఇచ్చారు.


రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ గత నెలలో ఆప్‌తో తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరారు. రాజ్యసభ ఎంపీలు హర్బజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్‌ జిత్ సింగ్, స్వాతి మలివాల్ సైతం బీజేపీలోకి వెళ్లిపోయారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు బీజేపీలో విలీనమవ్వడం చట్టవిరుద్ధమని, ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి ఈనెల 5న తీసుకువెళ్లనున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం తెలిపారు.


కాగా, పార్టీ మారిన కొద్దిరోజులకే ఎంపీ సందీప్ పాఠక్‌పై పంజాబ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు కేసుల్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. నాన్‌బెయిలబుల్ కేసులు కావడంతో ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే పంజాబ్ పోలీసులు పాఠక్ పంజాబ్ నివాసం వద్ద భారీగా మోహరించడం, ఆయన ఢిల్లీలోని తన నివాసం వెనుక వైపు నుంచి కారులో అజ్ఞాత ప్రదేశంలోకి వెళ్లిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై రాఘవ్ చద్దా ఘాటుగా స్పందించారు. బీజేపీలో చేరిన ఎంపీలపై తప్పుడు కేసులు పెట్టడానికి పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తోందని, దీనిపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రపతి అపాయిమెంట్ కోరానని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం

ఓట్ల లెక్కింపు రోజున అవాంతరాలకు బీజేపీ పథకం... ఈసీకి డీఎంకే లేఖ

Updated Date - May 03 , 2026 | 07:46 PM