కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం
ABN , Publish Date - May 03 , 2026 | 05:46 PM
కేరళం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్తాజా చర్య అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. కౌంటింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు తన సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ వివరాల్లో 'ముఖ్యమంత్రి' పదాన్ని తొలగించారు. ఆ ప్లేస్‌లో సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అని చేర్చారు.
తిరువనంతపురం: కేరళం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) తాజా చర్య అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలను సోమవారంనాడు లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు తన సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ వివరాల్లో 'ముఖ్యమంత్రి' పదాన్ని తొలగించారు. ఆ ప్లేస్‌లో సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అని చేర్చారు. ఆదివారంనాడు తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ఈ మార్పు చేశారు.
కాగా, విజయన్ ఎలాగూ ఓడిపోతారనే తెలిసే ముఖ్యమంత్రి పదాన్ని తీసివేసి ఉంటారని కేరళలోని విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయితే దీనికి లెఫ్ట్ పార్టీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఎలాగూ ఫలితాలు కొద్ది గంటల్లో వస్తాయని తెలిసినందునే ఒక నియమావళికి కట్టుబడి 'ముఖ్యమంత్రి' పదాన్ని పినరయి విజయన్ తొలగించారని, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ హుందాగా వ్యవహరించారని లెఫ్ట్ నేతలు పేర్కొన్నారు. విపక్షాలు చిల్లరి రాజకీయ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నాయని తప్పుపట్టారు.
పినరయి విజయన్ వరుసగా మూడోసారి ధర్మదం నియోజకవర్గం నుంచి విజయాన్ని ఆశిస్తున్నారు. ఆయనపై యూడీఎఫ్ అభ్యర్థిగా వీపీ అబ్దుల్ రషీద్, బీజేపీ అభ్యర్థిగా కె.రణ్‌జీత్ పోటీలో ఉన్నారు. 2016, 2021లో వరుసగా ఈ నియోజకవర్గం నుంచి పినరయి గెలుపొందారు.
ఎగ్జిట్ పోల్స్ ఏమి చెప్పాయంటే..
కాగా, ఈసారి కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ గెలస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 140 సీట్లలో 70-80 సీట్లు యూడీఎఫ్ గెలుస్తుందని, ఎల్‌డీఎఫ్‌కు 49-62 సీట్లు రావచ్చని 'యాక్సి మై ఇండియా' ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సైతం యూడీఎఫ్‌కు 75-85, ఎల్డీఎఫ్కు 52-60 సీట్లు వస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 9న ఒకే విడతలో కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మే 4న ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఓట్ల లెక్కింపు రోజున అవాంతరాలకు బీజేపీ పథకం... ఈసీకి డీఎంకే లేఖ
500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం