ఓట్ల లెక్కింపు రోజున అవాంతరాలకు బీజేపీ పథకం... ఈసీకి డీఎంకే లేఖ
ABN , Publish Date - May 03 , 2026 | 04:54 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ సెంటర్ల వద్ద అంతరాయాలు కలిగించడానికి బీజేపీ పథక రచన చేస్తోందని అధికార డీఎంకే (DMK) ఆరోపించింది. పెద్దఎత్తున శాంతిభద్రతలకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్.భారతి ఎన్నికల ప్రధానాధికారికి ఆదివారంనాడు లేఖ రాశారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ సెంటర్ల వద్ద అంతరాయాలు కలిగించడానికి బీజేపీ పథక రచన చేస్తోందని అధికార డీఎంకే (DMK) ఆరోపించింది. పెద్దఎత్తున శాంతిభద్రతలకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కౌంటింగ్ ప్రక్రియ సమగ్రతను కాపాడేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూసేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్.భారతి ఎన్నికల ప్రధానాధికారికి ఆదివారంనాడు లేఖ రాశారు.
బీజేపీ, ఇతర రాజకీయల పార్టీలు కేంద్రంలోని అధికార పార్టీ సూచనల మేరకు కౌంటింగ్ సెంటర్ల వల్ల అవాంతరాలు సృష్టించేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ఆ లేఖలో ఆర్ఎస్ భారతి పేర్కొన్నారు. కౌంటింగ్ బూత్‌లకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, పార్టీ కార్యాలయాలు ఉన్న సున్నితమైన ప్రాంతాల్లో కూడా అవాంతరాలు సృష్టించే వీలుందని డీఎంకే నేత ఆరోపించారు. ఇందువల్ల పెద్దఎత్తున శాంతిభద్రతలకు సమస్య తలెత్తవచ్చని, ఆ ప్రభావం స్వేచ్ఛగా, సజావుగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియపై పడవచ్చని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా తగినంత భద్రతా సిబ్బందిని నియమించాలని, ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని కట్టుదిట్టం చేయాలని ఎన్నికల ప్రధానాధికారిని ఆ లేఖలో కోరారు. తద్వారా ఎన్నికల ప్రక్రియ పవిత్రత, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. మే 4న అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ జరిపి, ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి..
500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం
తమిళనాడులో మొదలైన రిసార్ట్ రాజకీయాలు.. విజయ్ ముందు జాగ్రత్త..