రీల్స్ పిచ్చితో ఒకరి మృతి, నలుగురికి గాయాలు.. రంగంలోకి దిగిన ఆర్మీ..
ABN , Publish Date - May 03 , 2026 | 03:22 PM
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లా సిద్ధార్థనగర్‌కు చెందిన ఐదుగురు చిన్నారులు శనివారం నాడు రీల్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కాన్షీరామ్ అవాసియ్ కాలనీలోని ఓ పాడుపడిన వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లారు. అయితే..
ఉత్తర్ ప్రదేశ్: చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకూ చాలా మంది సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు. అందరి లాగానే తామూ ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నారు. పాపులర్ అయ్యేందుకు రీల్స్ చేస్తూ కొంతమంది నవ్వుల పాలు అవుతుండగా.. ఏం చేసైనా సరే ఫేమస్ కావాలని మరికొంతమంది పిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రీల్స్ మోజు ఒకరి ప్రాణం తీయగా.. నలుగురిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లా సిద్ధార్థనగర్‌కు చెందిన ఐదుగురు చిన్నారులు శనివారం నాడు రీల్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కాన్షీరామ్ అవాసియ్ కాలనీలోని ఓ పాడుపడిన వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లారు. దానిపైకి ఎక్కి రీల్స్ తీయాలని అనుకున్నారు. అయితే, ఆ వాటర్ ట్యాంక్ దాదాపు కూలిపోయే స్థితిలో ఉంది. ఐదుగురు కలిసి ట్యాంక్ మెట్లు ఎక్కి దాదాపు పైవరకూ చేరుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా మెట్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు పైనుంచి పడిపోయారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరో ఇద్దరు ప్రమాదం నుంచి తప్పించుకుని ట్యాంక్ పైకి ఎక్కేశారు. స్థానికుల సమాచారం మేరకు జిల్లా స్థాయి అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి బాలురను కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. అయితే, వర్షం కారణంగా వారిని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో రాష్ట్ర అధికారుల అభ్యర్థన మేరకు సెంట్రల్ ఎయిర్ కమాండ్‌కు చెందిన ఐఏఎఫ్ ఎంఐ-17 వి5 హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది.
ఈరోజు (ఆదివారం) ఉదయం 5:20 గంటల ప్రాంతంలో 15 నిమిషాల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టి ఇద్దరు చిన్నారులను కాపాడింది. దాదాపు 16 గంటలపాటు మెుత్తం ఆపరేషన్ కొనసాగగా.. రాత్రంతా వారిద్దరూ ట్యాంక్ పైనే ఉండిపోవాల్సి వచ్చింది. చిన్నారులను కాపాడిన విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా భారత వైమానిక దళం పోస్ట్ పెట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి
తమిళనాడులో మొదలైన రిసార్ట్ రాజకీయాలు.. విజయ్ ముందు జాగ్రత్త..
పూజల పేరుతో జ్యోతిష్యుడి దారుణం.. మహిళను భయపెట్టి పలుమార్లు అత్యాచారం..