మిస్ యూనివర్స్ ఇండియా 2026: విజేతగా 19 ఏళ్ల కేరళ కుట్టి
ABN , Publish Date - Aug 24 , 2026 | 04:00 PM
కేరళకు చెందిన 19 ఏళ్ల లా విద్యార్థిని, మోడల్ కాజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో 52 మంది ఫైనలిస్టులను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: కేరళకు చెందిన 19 ఏళ్ల లా విద్యార్థిని, మోడల్ కాజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో 52 మంది ఫైనలిస్టులను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలిచారు. దీంతో నవంబర్‌లో పోర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున ఆమె బరిలోకి దిగనున్నారు.
కేరళ నుంచి జాతీయ స్థాయికి..
కాజియా స్వస్థలం కేరళ అయినప్పటికీ ఆమె బాల్యం ఎక్కువగా యూఏఈలోని అబుదాబిలో గడిచింది. ఎమిరేట్స్ నేషనల్ స్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్, అబుదాబి ఇండియన్ స్కూల్‌లో ఆమె విద్యాభ్యాసం సాగింది. పేజెంట్రీతో పాటు కాజియాకు కళలపై కూడా ఆసక్తి ఉంది. 12 ఏళ్ల పాటు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. గాయని, సంగీత కళాకారిణిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. డ్రమ్స్, వయోలిన్ వాయించగలరు. పబ్లిక్ స్పీకింగ్, నటనలోనూ అనుభవం ఉంది. మలయాళ చిత్రం ‘షైలాక్’ ద్వారా నటిగా కూడా అరంగేట్రం చేశారు.
కేరళకు చెందిన కాజియా ప్రస్తుతం లా చదువుతూనే మోడలింగ్‌లో రాణిస్తున్నారు. చిన్న వయసులోనే అందాల పోటీల్లో తన సత్తా చాటుతున్నారు. 17 ఏళ్ల వయసులో మిస్ టీన్ దివా 2024 టైటిల్‌ను గెలుచుకున్నారు. అనంతరం 2025 మిస్ టీన్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ కేరళ 2026 పోటీల్లో విజేతగా నిలిచి.. ఆ టైటిల్‌ను గెలిచిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఏకంగా మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని దక్కించుకోవడం విశేషం.
జైపూర్‌లో హోరాహోరీ పోటీ..
మిస్ యూనివర్స్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలేలో 52 మంది ఫైనలిస్టులు పోటీ పడగా.. కజియా లిజ్ మేజో విజేతగా నిలిచారు. తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, గుజరాత్‌కు చెందిన అనుశ్రీ సాతవ్లేకర్ సెకండ్ రన్నరప్‌గా ఎంపికయ్యారు. అంతేకాకుండా అనుశ్రీకి మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2026 టైటిల్ కూడా దక్కింది. ఈ ఫినాలేకు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో పాటు మాజీ మిస్ యూనివర్స్ ఇండియా విజేతలు ఊర్వశి రౌతేలా, సెలీనా జైట్లీ తదితరులు జడ్జీలుగా వ్యవహరించారు.
ఇవి కూడా చదవండి:
పడిక్కల్‌ను పక్కన పెట్టలేరు.. ఇక్కడ కోచ్‌గా గంభీర్‌కు పెద్దగా పని లేదు: క్రిస్ శ్రీకాంత్
బాలికపై లైంగిక వేధింపులు.. ద్రోణాచార్య అవార్డు గ్రహీతపై పోక్సో కేసు