బాలికపై లైంగిక వేధింపులు.. ద్రోణాచార్య అవార్డు గ్రహీతపై పోక్సో కేసు
ABN , Publish Date - Aug 24 , 2026 | 02:32 PM
16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ద్రోణాచార్య అవార్డు గ్రహీత జిమ్నాస్టిక్స్ కోచ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ద్రోణాచార్య అవార్డు గ్రహీత జిమ్నాస్టిక్స్ కోచ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. 45 ఏళ్ల జిమ్నాస్టిక్ కోచ్ గణేశ్ ప్రభాకర్‌పై విలెపార్లే ప్రాంతానికి చెందిన బాలిక ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితురాలైన బాలిక కొన్నేళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇంటి వద్ద చదువుకుంటున్న బాలికకు కోచ్ వాట్సాప్‌లో ‘హాయ్’ అంటూ మెసేజ్ పంపాడు. దీంతో కోచ్‌ను సంప్రదించి విషయం తెలుసుకోవాలని బాలిక తల్లి సూచించింది. అనంతరం బాలికను జిమ్నాసియంకు రావాలని, కలిసేందుకు సమయం ఉందా అని కోచ్ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో బాలిక అక్కడికి వెళ్లగా.. ఒంటరిగా ఉన్న కోచ్ గణేశ్ ఆమెను అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అక్కడ నుంచి ఎలాగొలా బయటపడిన ఆ బాలిక కాలేజీకి వెళ్లిపోయింది. ముభావంగా ఉన్న ఆమెను పీఈటీ గమనించి ఆరా తీశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు టీచర్ వెంటనే బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం విలెపార్లే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో టెస్టులో రిషబ్ పంత్ అరుదైన ఘనత
ఓడినప్పటికీ చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌలర్