మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు.. నిందితురాలికి బెయిల్ మంజూరు..
ABN , Publish Date - Apr 28 , 2026 | 07:35 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరు అయ్యింది. హత్య కేసుతో తనకెలాంటి సంబంధం లేదని షిల్లాంగ్ కోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం.. సోనమ్‌కు బెయిల్ ఇచ్చింది.
మధ్యప్రదేశ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరు అయ్యింది. తన భర్త రాజా రఘువంశీని తాను హత్య చేయలేదని 2025 డిసెంబర్‌లో షిల్లాంగ్ కోర్టును ఆమె ఆశ్రయించింది. హత్య కేసుతో తనకెలాంటి సంబంధం లేదని బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇరువర్గాల వాదనల అనంతరం సోనమ్‌కు ఇవాళ (మంగళవారం) బెయిల్ మంజూరు చేసింది. 11 నెలల తర్వాత ఆమె జైలు నుంచి విడుదల కానుంది.
భర్త రాజా రఘువంశీతో తాను సంతోషంగానే ఉన్నట్లు సోనమ్ రఘువంశీ తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొంది. సహ నిందితుడు రాజ్ కుష్వాహాతో తనకు 'అన్నాచెల్లెళ్ల' బంధం ఉందని.. అతనితో వివాహేతర సంబంధం లేదని కోర్టుకు విన్నవించింది. తమ వివాహ ఏర్పాట్లు అన్నింటిలోనూ తానెంతో చురుకుగా పాల్గొన్నానని.. రాజా ఇష్టాలకు అనుగుణంగానే వివాహ దుస్తులూ కొనుగోలు చేసినట్లు పిటిషన్‌లో వివరించింది. రాజాతో పెళ్లి కోసం తాను ఎంతగానో ఎదురుచూశానని, అతనిపై తనకెలాంటి ద్వేషం లేదని తెలిపింది. భర్తను హత్య చేయాల్సిన అవసరం తనకు లేదని కోర్టు దృష్టికి తెచ్చింది. సోనమ్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
కేసు ఏంటంటే..?
మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్‌తో 2025 మేలో వివాహం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వారిద్దరూ హనీమూన్‌కు వెళ్లారు. అస్సాంలోని ప్రసిద్ధ శక్తిపీఠమైన కామాఖ్య ఆలయాన్ని సందర్శించి అనంతరం మేఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లారు. షిల్లాంగ్ చేరిన తర్వాత 2025 మే 23న అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా మృతదేహం స్థానికంగా ఉన్న ఓ లోయలో లభ్యమైంది. దీంతో సోనమ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. జూన్ 9న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజీపూర్‌లోని ఓ దాబాలో ఆమెను పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు తనకు మత్తుమందు ఇచ్చి ఇక్కడ వదిలేశారని పోలీసులకు సోనమ్ తెలిపింది. అనంతరం ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త రాజాను హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకుంది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
ఈ వార్తలు కూడా చదవండి
శబరిమల కేసులో కీలక మలుపు.. సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు
అభిషేక్ బెనర్జీ కంచుకోటలో యూపీ సింగం.. వీడియో వైరల్