Share News

మేఘాలయలో ఎదురుకాల్పులు.. నలుగురు సాయుధుల మృతి..

ABN , Publish Date - Aug 30 , 2026 | 08:34 PM

మేఘాలయలోని ఈస్ట్‌ గారో హిల్స్‌ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు సాయుధులు మృతిచెందారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై నిందితులు కాల్పులకు తెగబడటంతో ఎన్‌కౌంటర్ జరిగింది.

మేఘాలయలో ఎదురుకాల్పులు.. నలుగురు సాయుధుల మృతి..
Meghalaya Encounter

షిల్లాంగ్‌: మేఘాలయలోని ఈస్ట్‌ గారో హిల్స్‌ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు సాయుధులు మృతిచెందారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై నిందితులు కాల్పులకు తెగబడటంతో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


సాంగ్‌సాక్‌ ప్రాంతంలో ఈరోజు ఉదయం సుమారు 4 గంటలకు పోలీసులు నాకా చెకింగ్‌ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు తనిఖీలు చేస్తున్న పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన ఖాకీలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు దుండగులూ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. మృతుల వద్ద లభించిన వివరాల ఆధారంగా వారి గుర్తింపును నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు, ఈ నలుగురికి రాష్ట్ర సరిహద్దుకు అవతల టాప్రా ప్రాంతంలో ఆగస్టు 25న జరిగిన ఓ ఘటనతో సంబంధం ఉండొచ్చన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేశారు. ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.


ఎదురుకాల్పుల ఘటనపై ఈస్ట్‌ గారో హిల్స్‌ ఎస్పీ స్వప్నిల్‌ పవార్‌ స్పందించారు. ముందుగా మృతుల గుర్తింపును నిర్ధారించాల్సి ఉందని, అనంతరం వారి నేర చరిత్రను పరిశీలిస్తామని చెప్పారు. గతంలో నమోదైన కేసులతో వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న అంశాన్నీ దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తామని ఎస్పీ వెల్లడించారు. కాల్పులు ఎలా ప్రారంభమయ్యాయి?, నాకా చెకింగ్‌ వద్దకు వచ్చిన వ్యక్తుల వద్ద ఆయుధాలు ఎలా ఉన్నాయి?, పోలీసులపై కాల్పులు జరపడానికి దారితీసిన పరిస్థితులు వంటి అంశాలపైనా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రష్యాకు పెట్రోల్ సరఫరాదారుగా భారత్.. రిఫైనరీలపై దాడులతో ఇంధన కొరత..

మేఘాలయ రాజ'కీ'యం.. బీజేపీలో విలీనం దిశగా యూడీపీ ఎమ్మెల్యేలు

Updated Date - Aug 30 , 2026 | 08:36 PM