మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ
ABN , Publish Date - Jun 09 , 2026 | 08:13 PM
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిని ఎన్నికల అధికారి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ స్పందించారు.
న్యూఢిల్లీ, జూన్09: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి తిరస్కరించడంపై ఆ పార్టీ స్పందించింది. బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన బహిరంగ ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. ఆమె నామినేషన్‌లో ఏదైనా తప్పు లేదా వివరాలను వెల్లడించలేదనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవని పేర్కొన్నారు.
ఇది కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన స్థానాన్ని లాక్కోవడానికి చేసిన నిరాశాజనకమైన ప్రయత్నం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకునే బీజేపీ కుట్రలు విఫలమవుతున్నాయని గ్రహించిన తర్వాత, వారు ఇంత దిగజారిపోయి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారని వివరించారు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఉన్న నిబద్ధత ఎంత బూటకమో మరోసారి నిరూపిస్తోందని తెలిపారు.
ప్రతి దశలోనూ బీజేపీ ఏదో ఒక రూపంలో ఓట్ల చోరీ (Vote Chori) చేయడానికే ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు దోచుకునే ఈ చర్యను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని కరాకండిగా చెప్పారు. దీనిపై న్యాయపరంగా, రాజకీయంగా, ప్రజల మధ్యన గట్టిగా పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ అన్నారు.
మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ పత్రాలతో ఒక పెండింగ్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించ లేదంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వీటిని పరిశీలించిన అధికారి.. ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. మీనాక్షి నటరాజన్ గతంలో లోక్‌సభ సభ్యురాలిగా పనిచేసిన విషయం విదితమే. ఆమె నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్ కీలక నిర్ణయం.. మహిళల భద్రత కోసం సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్
హిల్ రీడ్జ్ విల్లా దోపిడి కేసును 24 గంటల్లో ఛేదించాం: డీసీపీ
For More National News And Telugu News