బీఎస్పీలో మళ్లీ కీలక బాధ్యతలు దక్కాలంటే.. మేనల్లుడికి మాయావతి పెట్టిన షరతు ఇదే..
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:55 PM
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. ఆకాశ్ ఆనంద్ మళ్లీ పార్టీలో స్వేచ్ఛగా పనిచేయాలంటే ఆయన మామగారు, మాజీ రాజ్యసభ సభ్యుడు అశోక్ సిద్ధార్థ్ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని షరతు పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. ఆకాశ్ ఆనంద్ మళ్లీ పార్టీలో స్వేచ్ఛగా పనిచేయాలంటే ఆయన మామగారు, మాజీ రాజ్యసభ సభ్యుడు అశోక్ సిద్ధార్థ్ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని షరతు పెట్టారు. అశోక్ సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం తీసుకుంటేనే ఆకాశ్‌కు గతంలోని బాధ్యతలను తిరిగి ఇవ్వడంపై పార్టీ ఆలోచిస్తుందని మాయావతి తెలిపారు (Akash Anand BSP Return).
ఇటీవల ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్పీ చీఫ్ నేషనల్ కో-ఆర్డినేటర్ పదవి నుంచి మాయావతి తొలగించారు. పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడానికి ఆయనకు ఇంకా రాజకీయ పరిపక్వత అవసరమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతానికి పార్టీ కార్యకర్తగానే కొనసాగాలని సూచించారు. అయితే ఇప్పుడు మాయావతి యూటర్న్ తీసుకున్నారు. ఆకాశ్‌కు మళ్లీ పార్టీలో కీలక పాత్ర దక్కే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చారు. అయితే దీనికి ముందు అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని ఆమె స్పష్టం చేశారు (Mayawati, Akash Anand).
బీఎస్పీ ఉద్యమం కంటే వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలకే అశోక్ సిద్ధార్థ్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని మాయావతి ఆరోపించారు (Ashok Siddharth BSP). తన వైఖరిని మార్చుకునేందుకు పార్టీ ఆయనకు పలుమార్లు అవకాశం ఇచ్చిందని, అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని పేర్కొన్నారు. దీని ప్రభావం ఆకాశ్ ఆనంద్‌పైనా పడిందని ఆమె అన్నారు. అశోక్ సిద్ధార్థ్ తన రాజకీయ ఆకాంక్షలను వదులుకుని పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటే, ఆకాశ్ ఆనంద్ బీఎస్పీలో స్వేచ్ఛగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని మాయావతి తెలిపారు. అశోక్ సిద్ధార్థ్‌ను మాయావతి ఆగస్టు 2న బీఎస్పీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు పూర్తిగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..
మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..