మండుటెండలో నిరాహార దీక్ష ప్రారంభించిన మనోజ్ జారంగే
ABN , Publish Date - May 30 , 2026 | 03:48 PM
మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జారంగే పాటిల్ మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంతర్వాలి సరతి గ్రామంలో మండుటెండల మధ్య ఆయన శనివారంనాడు నిరసన దీక్షకు కూర్చున్నారు.
ముంబై: మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జారంగే పాటిల్ (Manoj Jarage-Patil) మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంతర్వాలి సరతి గ్రామంలో మండుటెండల మధ్య ఆయన శనివారంనాడు నిరసన దీక్షకు కూర్చున్నారు. ఆయన చేసిన డిమాండ్లపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు సాగిస్తుండటంతో పాటు వాటిని సానుకూలంగా పరిశీలించగలమని శుక్రవారం రాత్రి హామీ ఇచ్చింది. అయినప్పటికీ తమకిచ్చిన హామీల అమలులో ఎడతెరిపి లేకుండా జాప్యం జరుగుతూ వస్తోందంటూ ఆయన దీక్షకు దిగారు.
అంతర్వాలి సరతి గ్రామానికి చేరుకున్న జలవనరుల శాఖ మంత్రి రాధాకృష్ణన్ విఖే-పాటిల్ నిరసన దీక్షను విరమించాల్సిందిగా మనోజ్ జారంగేను కోరారు. కీలక డిమాండ్లు నెరవేర్చేందుకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫున ఆయన కోరడంతో తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంచినీళ్లు, ఆహారం లేకుండా, మండుటెండను కూడా లెక్కచేయకుండా బహిరంగ ప్రదేశంలో జారంగే నిరసన దీక్షకు దిగారు. నిరసన ప్రదేశాన్ని ఎండ, ప్రమాదాల నుంచి రక్షణనిచ్చే ప్రదేశానికి మార్చాలని మంత్రి చేసిన విజ్ఞప్తిని కూడా ఆయన తోసిపుచ్చారు.
గత ఏడాది ముంబై ఆజాద్ మైదానంలో నిరాహార దీక్ష సందర్భంగా తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై మనోజ్ జారంగే అసంతృప్తితో ఉన్నారు. మరాఠా రిజర్వేషన్ ప్రక్రియ కింద కుంబి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని ఆయన ప్రశ్నించారు. నెలలోగా సతారా గెజిట్‌ను అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం పది నెలలుగా జాప్యం చేస్తోందని, ఇలా ఎంత కాలం వేచిచూడాలని నిలదీశారు. కుంబీ పూర్వ చరిత్రను ధ్రువీకరించే 58 లక్షల నమోదులను హైదరాబాద్ గెజిట్ నుంచి సేకరించారని, ధ్రువపత్రాలను ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. సతారా గెజిట్ అమలుకు గవర్నమెంట్ రిజల్యూషన్ (జీఆర్)ను ప్రభుత్వం జారీ చేయాలని, మరాఠా కమ్యూనిటీ నుంచి అర్హులైన అప్లికెంట్లకు కుల సర్టిఫికెట్, ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు నిరాకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు డిప్యూటీ సీఎంలకు డీకే విముఖత.. మంత్రివర్గంలో వీరికి ఛాన్స్
ఉగ్ర కుట్ర భగ్నం.. పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్న 9 మంది అరెస్టు