Share News

రాహుల్ తప్పుకోవాలి.. మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:20 PM

కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి సొంత పార్టీపై విమర్శల దాడి చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. 'ఇండియా' కూటమి సారథ్య బాధ్యతల నుంచి రాహుల్‌గాంధీ తప్పుకోవాలని, ప్రాంతీయ నేతలకు అప్పగించాలని సూచించారు.

రాహుల్ తప్పుకోవాలి.. మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
Mani Shankar Aiyar

కోల్‌కతా: కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) మరోసారి సొంత పార్టీపై విమర్శల దాడి చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వాన్ని ప్రశ్నించారు. 'ఇండియా' కూటమి సారథ్య బాధ్యతల నుంచి రాహుల్‌గాంధీ తప్పుకోవాలని, ఆ బాధ్యతలను ప్రాంతీయ పార్టీల నేతలకు అప్పగించాలని కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన సూచించారు. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఎంకే స్టాలిన్, తేజస్వి యాదవ్ వంటి సమర్ధులైన నేతలు రాహుల్ గాంధీ నుంచి పగ్గాలు చేపట్టాలని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ ఇటీవల పలు ఎన్నికల్లో వైఫల్యాలను చవిచూడడాన్ని అయ్యర్ ప్రస్తావిస్తూ, మమతా బెనర్జీని దూరం చేసుకోవడం వల్లే కాంగ్రెస్ బలహీనపడిందని అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ లేకుంటే 'ఇండియా' కూటమి ఉనికికే ప్రమాదమని అన్నారు. కూటమి బాధ్యతలను తన చేతిలో పెట్టుకోకుండా ప్రాంతీయ పార్టీల నేతలైన స్టాలిన్, మమతా దీదీ, అఖిలేష్, తేజస్వి, ఇంకెవరికైనా రాహుల్ గాంధీ అప్పగిస్తారని ఆశిస్తున్నానని, వారయితే ఎక్కువ సమయం కేటాయించగలరని అయ్యర్ అన్నారు.


కాంగ్రెస్ పార్టీపై మణిశంకర్ అయ్యర్ నిశిత విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొన్న ఒక కార్యక్రమానికి అయ్యర్ హాజరయ్యారు. పినరయి విజయన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పినరయి విజయన్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీని ఇరకాటంలో నెట్టింది. మణిశంకర్ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదని, ఆయన వ్యాఖ్యలు, వ్యాసాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని పేర్కొంది.


రాజ్యసభ సీటు కోసమే..

కాగా, 'ఇండియా' కూటమి నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ అయ్యర్ చేసిన తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ వెంటనే స్పందించింది. రాహుల్ గాంధీ మాత్రమే ఇండియా కూటమిని సమర్ధవంతంగా ముందుకు నడిపించగలరని, బీజేపీని ఎదుర్కొనగలిగే సత్తా రాహుల్‌కే ఉందని ఆ పార్టీ నేత ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యానించారు. బెంగాల్ కాంగ్రెస్ నేతలు సైతం అయ్యర్ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి చాలాకాలంగా మణిశంకర్ అయ్యర్ దూరంగా ఉన్నారని, బెంగాల్ నుంచి ఐదు రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉండటమే మణిశంకర్ అయ్యర్ తాజా వ్యాఖ్యలకు కారణం కావచ్చని బెంగాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుమన్ రాయ్ అన్నారు.


ఇవి కూడా చదవండి..

టీఎంసీ అగ్రనేత ముకుల్‌రాయ్ కన్నుమూత

దేవ్‌జీ లొంగుబాటు!

Updated Date - Feb 23 , 2026 | 05:25 PM