కోల్‌కతాను పాక్ టార్గెట్ చేస్తామంటే ఉలకరేం?.. మోదీపై మమత ఫైర్
ABN , Publish Date - Apr 06 , 2026 | 08:08 PM
ఈసారి యుద్ధం అంటూ జరిగితే కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరిని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తప్పుపట్టారు. మోదీ మౌనాన్ని పశ్నించారు. తక్షణం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కోల్‌కతా: ఈసారి యుద్ధం అంటూ జరిగితే కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరిని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ (Mamata Banerjee) తప్పుపట్టారు. మోదీ మౌనాన్ని పశ్నించారు. తక్షణం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాదియా జిల్లాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఎన్నికల ర్యాలీల్లో బెంగాల్‌ను మోదీ టార్గెట్ చేస్తుంటారని, బెంగాల్‌పై దాడి చేస్తామని పాకిస్థాన్ పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రధాని తక్షణం తన పదవికి రాజీనామా చేయాలన్నారు.
పాక్ మంత్రి ఏమన్నారు?
భవిష్యత్తులో భారత్ తమపై దాడులు చేస్తే కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామని, ప్రతిదాడులను ఆ ప్రాంతం వరకూ తీసుకువెళ్తామని ఖవాజా ఆసిఫ్ తన స్వస్థలమైన సియాల్‌కోట్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఎక్కడైనా కొంతమంది మృతదేహాలను పడేసి వారు ఉగ్రవాదులను నమ్మించేలా భారత్ బూటకపు ఆపరేషన్లు చేస్తుంటుందని, ఇప్పుడు ఇరాన్ యుద్ధం సాకుగా పాక్‌పై దుస్సాహసానికి పాల్పడినే ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
బెంగాల్‌లో ఆ ఊసేదే..
పాక్ మంత్రి ప్రేలాపనపై మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. 'బెంగాల్‌లో మోదీ ర్యాలీ తీసినప్పుడు ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్ రక్షణ మంత్రి బెదిరిస్తుంటే గట్టిగా బుద్ధి చెబుతామని ప్రధాని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆయన (మోదీ) ఊరుకున్నా మేము మాత్రం దేశాన్ని, బెంగాల్‌ను ఎవరు బెదిరించినా సహించేది లేదు' అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్
బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత