భవానీపూర్‌లో మమతా బెనర్జీ పాదయాత్ర
ABN , Publish Date - Apr 26 , 2026 | 09:25 PM
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజవర్గమైన భవానీపూర్‌లో ఆదివారంనాడు పాదయాత్ర జరిపారు. స్థానికులను కలుస్తూ ముందుకు కదిలారు. ఈ పాదయాత్రలో వేలాది మంది మద్దతుదారులు పాల్గొన్నారు.
భవానీపూర్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తన సొంత నియోజవర్గమైన భవానీపూర్‌లో ఆదివారంనాడు పాదయాత్ర (Padayatra) జరిపారు. స్థానికులను కలుస్తూ ముందుకు కదిలారు. ఈ పాదయాత్రలో వేలాది మంది మద్దతుదారులు పాల్గొన్నారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి మమతాబెనర్జీ పోటీ చేస్తుండగా, ఈనెల 29న తుదివిడత పోలింగ్‌లో భవానీపూర్ నియోజవర్గం కూడా ఉంది.
భవానీ పూర్ ప్రతి ఎన్నికలోనూ కీలక రాజకీయ కేంద్రంగా నిలుస్తోంది. భిన్న సంస్కృతుల సమ్మేళనం ఇక్కడ కనిపిస్తుంది. బెంగాలీ, గుజరాతీ, మర్వారి, సిక్కు కమ్యూనిటీలు ప్రధానంగా ఇక్కడ నివసిస్తుంటారు. రెండో విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగియనుండటంతో కోల్‌కతాలో భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ డ్రోన్ నిఘాను పెంచింది. భవానీపూర్‌లో పారామిలటరీ బలగాలను కూడా పెద్దఎత్తున మోహరించారు. ఈ నియోజకవర్గంలో మమతా బెనర్జీ ప్రత్యర్థిగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి పోటీ పడుతున్నారు. కోల్‌కతాలో తన రాజకీయ నాయకత్వం కొనసాగించేందుకు భవానీపూర్‌లో గెలుపు మమతా బెనర్జీకి కీలకంగా ఉంది. సువేందు అధికారి సైతం 2021లో నందిగామ్ నుంచి మమతాబెనర్జీపై గెలిచారు. ఈసారి భవానీపూర్‌లోనూ గెలుపే లక్ష్యంగా ఆయన ప్రచారం సాగిస్తున్నారు.
మరోవైపు, బీజేపీ తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా ఆదివారంనాడు తుది విడత ప్రచారంలో పాల్గొన్నారు. బీహార్ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి మార్పుకు ఓటు వేయాలని, బీజేపీ గెలుపుతోనే చొరబాట్ల సమస్యకు తెరపడుతుందని, అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తామని చెబుతూ బీజేపీ అగ్రనేతలు ప్రచారం సాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మోదీ బలహీన ప్రధాని.. టీఎంసీకి మద్దతుగా కేజ్రీవాల్ ప్రచారం