మోదీ బలహీన ప్రధాని.. టీఎంసీకి మద్దతుగా కేజ్రీవాల్ ప్రచారం
ABN , Publish Date - Apr 26 , 2026 | 08:49 PM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. టీఎంసీ ఎన్నికల ప్రచారానికి మద్దతుగా బేలేఘాటాలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల సభలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 'బలహీన ప్రధాని'గా అభివర్ణించారు.
బేలేఘాటా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. టీఎంసీ ఎన్నికల ప్రచారానికి మద్దతుగా బేలేఘాటాలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల సభలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 'బలహీన ప్రధాని'గా అభివర్ణించారు. పశ్చిమబెంగాల్‌లో 27 లక్షల మంది ఓటర్లను తొలగించారని ఆరోపించారు.
ఇవి మామాలు ఎన్నికలు కావు..
'నేను మిమ్మల్ని కలిసేందుకు ఢిల్లీ నుంచి వచ్చాను. ఇవి మామాలు ఎన్నికలు కావు. దేశాన్ని రక్షించి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు జరుగుతున్న ఎన్నికలు. బీజేపీ తమ యంత్రాంగాన్నంతా బెంగాల్‌లో మోహరించింది. ఇది బెంగాల్ అస్థిత్వం, బెంగాల్ ప్రజల గౌరవంపై జరుగుతున్న దాడి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు బెంగాల్ మొత్తం ఒకటిగా నిలిచి బీజేపీ, అమిత్‌షా, మోదీకి గట్టి గుణపాఠం చెప్పాలి. వారిని చిత్తుగా ఓడించాలి' అని కేజ్రీవాల్ కోరారు.
75 ఏళ్లలో ఇలాంటి బలహీన ప్రధానిని చూడలేదు..
గత 75 ఏళ్లలో ఇలాంటి బలహీన ప్రధానిని చూడలేదని మోదీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. 'అంతర్జాతీయ వేదికలపై కూడా ఆయన దృఢంగా మాట్లాడలేకపోతున్నారు. డర్టీ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే వాళ్లు (బీజేపీ) పరిమితం. ఎస్ఐఆర్ చూట్టూనే ఈ ఎన్నికల పోరాటం జరుగుతోంది. పశ్చిమబెంగాల్‌లో సుమారు 27 లక్షల మంది ఓటర్లను తొలగించారు. మీరు ఓటరు కాకుండే మీ పౌరసత్వం ప్రశ్నార్ధకమవుతుంది. ఈవిషయంలో బాధితులంతా మమతా దీదీకి బాసటగా నిలిచి ఆమె కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం సాగించాలి' అని కేజ్రీవాల్ కోరారు.
పథకాలు ఆగిపోతాయి
ఢిల్లీలో కొన్ని సంక్షేమ పథకాలను బీజేపీ వెనక్కి మళ్లించిందని, బీజేపీ అధికారంలోకి వస్తే పశ్చిమబెంగాల్‌లోనూ అలాంటి సంక్షేమ పథకాలను బీజేపీ నిలిపేస్తుందని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఢిల్లీలో తాము చేసిన మంచిపనులను నాశనం చేశారని, మంచి స్కూళ్లు కట్టిస్తే వాటిని మూసేశారని, మొహల్లా క్లినిక్‌లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు తాము కల్పిస్తే వాటిని బీజేపీ ఆపేసిందని చెప్పారు. ఉచిత విద్యుత్ ఇస్తే దానిని కూడా ఆపేశారని, పొరపాటున మీరు బీజేపీకి ఓటు వేస్తే ఇక్కడ దీదీ చేపట్టిన అన్ని మంచి పనులను బీజేపీ ఆపేస్తుందని అన్నారు.
బెంగాల్‌లో ఈనెల 23న జరిగిన తొలి విడత పోలింగ్‌లో 92.35 శాతం భారీ పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్ ఈనెల 29న జరుగుతుంది. దీంతో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మే 4న ఫలితాలు ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి..
రెండో విడత ఎన్నికల వేళ .. బెంగాల్‌లో 100 నాటుబాంబులు స్వాధీనం