మోదీ చేతిలో కీలుబొమ్మగా ఎన్నికల కమిషనర్: ఖర్గే తీవ్ర ఆరోపణలు..
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:16 PM
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని ఆరోపించారు. తాజాగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఖర్గే నిప్పులు చెరిగారు (Mallikarjun Kharge about Gyanesh Kumar).
జ్ఞానేశ్ కుమార్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. జ్ఞానేశ్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపులో కుట్ర జరుగుతోందని, ఎన్నికల కమిషన్ పనితీరుపై తీవ్ర సందేహాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గే ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు సంబంధించి ఐదు ప్రధాన డిమాండ్లను వెల్లడించారు (CWC meeting SIR).
1. ఓటర్ల జాబితాలో మార్పుల పూర్తి వివరాలు:
ఓటర్ల జాబితాలో చేసిన ముఖ్యమైన మార్పులు, తొలగింపులు, చేర్పులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బహిరంగం చేయాలని కాంగ్రెస్ కోరింది.
2. పేరు తొలగించిన ఓటర్లకు అప్పీల్ అవకాశం:
ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించిన వ్యక్తులకు పూర్తి సమాచారం అందించి, నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసింది.
3. రాజకీయ పార్టీలకు సమాచారం సులభమైన రూపంలో ఇవ్వాలి:
ఓటర్ల జాబితాలు, సంబంధిత సమాచారాన్ని రాజకీయ పార్టీలకు సులభంగా అర్థమయ్యే రూపంలో, సకాలంలో అందించాలని కోరింది.
4. తీవ్రమైన అక్రమాలపై స్వతంత్ర విచారణ:
ఓటర్ల జాబితాలో తీవ్రమైన అవకతవకలకు ఆధారాలు కనిపిస్తే స్వతంత్రంగా, నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
5. ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత:
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక సమాచారం, నిర్ణయాలను మరింత పారదర్శకంగా ఉంచాలని కాంగ్రెస్ కోరింది.
ఇవి కూడా చదవండి...
ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్
సచివాలయ ఉద్యోగులకు 15వేలకు పైగా ప్రమోషన్లు ఇచ్చాం: మంత్రి డోలా