Share News

ప్రధాని కలలు కంటున్నారు, రెండు చోట్లా గెలుపు మాదే: మల్లికార్జున్ ఖర్గే

ABN , Publish Date - Apr 04 , 2026 | 09:38 PM

తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల్లో తమ విజయావకాశాలు చాలా బాగున్నాయని చెప్పారు.

ప్రధాని కలలు కంటున్నారు, రెండు చోట్లా గెలుపు మాదే: మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge

పుదుచ్చేరి: తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఎన్నికల్లో తమ విజయావకాశాలు చాలా బాగున్నాయని చెప్పారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రజలు డీఎంకే, కాంగ్రెస్‌తో ఉన్నారని, బీజేపీతో కాదని అన్నారు.


'కాంగ్రెస్, డీఎంకే కూటమి పాండిచ్చేరిలో గెలుపు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌దే ఎప్పుడూ విజయం. మా రికార్డు చాలా బాగుంది. ప్రధానమంత్రి కలలు కంటున్నారు. మేము మాత్రం కలగనడం లేదు. ప్రజలు మాతో ఉన్నారు, ప్రధాని మోదీతో కాదు. ఎన్నికల్లో మాకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి' అని ఖర్గే చెప్పారు. దీనికి ముందు ఆయన పాండిచ్చేరిలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు.


పుదుచ్చేరిని లూటీ చేసిన కూటమి ప్రభుత్వం

పుదుచ్చేరిలోని అధికార ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ), భాగస్వామ్య పార్టీ బీజేపీ కలిసి పుదుచ్చేరిని లూటీ చేసిందని ఖర్గే ఆరోపించారు. పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'పుదుచ్చేరికి పూర్తి స్థాయిు హోదా ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వ ప్రక్రియలో లెప్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారు. పుదుచ్చేరిలో 30 శాతం కమిషన్ వ్యవహారం నడుస్తోంది. ఎన్ఆర్, బీజేపీ కలిసి పుదుచ్చేరిని లూటీ చేస్తున్నారు. అన్నిచోట్లా అవీనీతి జరుగుతోంది. అవినీతి అస్సలు లేదని మోదీ చెబుతున్నారే కానీ ప్రతీదీ లూటీ చేసి అదానీకి కట్టబెడుతున్నారు' అని ఖర్గే విమర్శించారు. పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ బీజేపీ ప్రభుత్వం 450 లిక్కర్ షాపులు తెరవడాన్ని, డ్రగ్స్ కేసులు పెరగడాన్ని ఆయన ప్రశ్నించారు.


గత ఎన్నికల్లో..

పుదుచ్చేరిలో జరిగిన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎన్ఆర్‌సీ 10 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్దపార్టీగా నిలిచింది. డీఎంకే 6 సీట్లు గెలుచుకుంది. బీజేపీ, కాంగ్రెస్ చెరో 6 సీట్లు దక్కించుకున్నాయి. 84.8 శాతం పోలింగ్ జరిగింది. దీనికి ముందు 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ 15 సీట్లతో మెజారిటీ సాధించగా, ఏఐఎన్ఆర్‌సీ 8 సీట్లు, అన్నాడీఎంకే 4 సీట్లు, డీఎంకే 2 సీట్లు గెలుచుకున్నాయి. 83.6 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, 2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి. పుదుచ్చేరి ప్రస్తుతం అసెంబ్లీ గడువు జూన్ 15వ తేదీతో ముగియనుంది.


ఇవి కూడా చదవండి..

కేరళలో ఎల్‌డీఎఫ్‌కు ఉద్వాసన, బీజేపీ విజయం ఖాయం: మోదీ

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

Updated Date - Apr 04 , 2026 | 09:46 PM