Share News

వినూత్న తీర్మానం.. భార్యలు చనిపోయిన మగవాళ్లను ఆదుకోవాలి..

ABN , Publish Date - Feb 07 , 2026 | 08:57 AM

మహారాష్ట్రలోని సోనేవాడి గ్రామసభ ఓ వినూత్న తీర్మానాన్ని ఆమోదించింది. భార్య చనిపోయిన పురుషులకు మహిళా వితంతువుల మాదిరిగానే సామాజిక భద్రత కల్పించేలా ప్రభుత్వ పథకాలు మంజూరుచేయాలని కోరుతూ చేసిన తీర్మానానికి ఈ గ్రామసభ ఆమోదం తెలిపింది.

వినూత్న తీర్మానం.. భార్యలు చనిపోయిన మగవాళ్లను ఆదుకోవాలి..
widower welfare schemes,

మహారాష్ట్ర, ఫిబ్రవరి07: సాధారణంగా భర్తలు చనిపోయిన మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్ర(Maharashtra)లోని ఓ గ్రామ సభలో విచిత్రమైన తీర్మానం జరిగింది. అహిల్యానగర్ జిల్లా కోపర్ గావ్ ప్రాంతంలోని సోనేవాడి పంచాయతీ గ్రామసభ అందుకు వేదికైంది. ఆర్థికంగా బలహీనంగా ఉండి, నిరాశ్రయులైన భార్య చనిపోయిన పురుషులకు(విధురులు) మహిళా వితంతువుల మాదిరిగానే సామాజిక భద్రత కల్పించేలా ప్రభుత్వ పథకాలు మంజూరు చేయాలని కోరుతూ తీర్మానించారు. దానికి సోనేవాడి గ్రామసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం, సంజయ్‌గాంధీ నిరాధార్‌ అనుదాన్‌ యోజన(Sanjay Gandhi Niradhar Yojana) వంటి పథకాల కింద ప్రస్తుతం వితంతువులను ప్రభుత్వం ఆదుకుంటోంది. అయితే భార్యలు చనిపోయిన భర్తల పరిస్థితి దారుణంగా ఉంటుంది.


ఒంటరిగా ఉంటూ, ఆదరణ కరవైన పురుషులను ఆదుకునేందుకు మాత్రం ఎటువంటి ప్రత్యేకమైన పథకాలు లేవని గ్రామసభ ఆవేదన వ్యక్తం చేసింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పురుషుల గురించి కూడా ఆలోచించాలని కోరుతూ సోనేవాడి గ్రామస్థుడైన కిశోర్‌ జవాలే గ్రామసభలో ప్రతిపాదన చేశారు. సోనేవాడిలో భార్యలు లేని పురుషులు దాదాపు 150 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనిపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. పథకాల అమలులో వివక్షతో సామాజిక అసమానతలు పెరుగుతాయంటూ అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ శకుంతలా తాయి తెలిపారు. అలానే కిశోర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని( Gram Sabha decision ) ఆమోదించినట్లు సర్పంచ్ వెల్లడించారు. ఈ తీర్మానం కాపీని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు పంపుతామని గ్రామ పంచాయతీ కార్యదర్శి భానుదాస్‌ దభాడే ప్రకటించారు.


Also Read:

సోషల్‌ మీడియాకు వయో పరిమితి?

ఐదోరోజూ అదే తీరు లోక్‌సభలో సాగని కార్యకలాపాలు

Updated Date - Feb 07 , 2026 | 12:48 PM