ఐదోరోజూ అదే తీరు లోక్‌సభలో సాగని కార్యకలాపాలు
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:00 AM
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వరుసగా ఐదో రోజు కూడా లోక్‌సభలో అదే గందరగోళం నెలకొంది. ఆర్మీ మాజీ అధ్యక్షుడు ఎంఎం నరవణె ఆత్మకథ గ్రంథంలోని అంశాలను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రస్తావించగా...
బడ్జెట్‌పై ప్రారంభం కాని చర్చ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వరుసగా ఐదో రోజు కూడా లోక్‌సభలో అదే గందరగోళం నెలకొంది. ఆర్మీ మాజీ అధ్యక్షుడు ఎంఎం నరవణె ఆత్మకథ గ్రంథంలోని అంశాలను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రస్తావించగా, అధికార పక్షం అడ్డుకోవటంతో మొదలైన రభస శుక్రవారం కూడా కొనసాగింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ, సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ ఓంబిర్లా పదేపదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంఽధీకి అనుమతి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సభ ప్రారంభమైన 5 నిమిషాలకే వాయిదా పడింది. నిరసల మధ్య చివరికి సభను సోమవారానికి వాయిదా వేశారు. లోక్‌సభలో గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని సమాధానం లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదించిన విషయం తెలిసిందే. శుక్రవారం సాధారణ బడ్జెట్‌పై చర్చ ప్రారంభం కావాల్సి ఉన్నా.. పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో చర్చ చేపట్టలేదు. కాంగ్రె్‌సతోపాటు ఇతర విపక్ష ఎంపీలు మకర ధ్వజం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఒక ‘ట్రాప్ డీల్’ అని ఆరోపించారు. రాజ్యసభలో కూడా శుక్రవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రాజ్యసభలో గురువారం ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. తాము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము, ధైర్యం ఆయనకు లేవన్నారు. అసత్యాలు వల్లెవేయడమే ఆయన పని అని ఎద్దేవాచేశారు. ఖర్గే శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘97 నిమిషాల ప్రసంగంలో మోదీ అవసరం, ముఖ్యమైనదేదీ చెప్పలేదు. ఎంత సేపూ వందేళ్లు.. 75 ఏళ్లు.. 50 ఏళ్లు అని మాట్లాడతారు’’ అని ఎద్దేవా చేశారు.