Share News

సోషల్‌ మీడియాకు వయో పరిమితి?

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:01 AM

చిన్న పిల్లలను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచేందుకు వయో పరిమితులు విధించే విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వయసు ఆధారంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల వినియోగానికి అనుమతి ఇచ్చే విషయంలో ఇటీవల....

సోషల్‌ మీడియాకు వయో పరిమితి?

  • త్వరలో ప్రభుత్వ నిర్ణయం.. కేంద్ర ఐటీ కార్యదర్శి వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: చిన్న పిల్లలను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచేందుకు వయో పరిమితులు విధించే విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వయసు ఆధారంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల వినియోగానికి అనుమతి ఇచ్చే విషయంలో ఇటీవల ఆర్థిక సర్వే పలు సూచనలు చేసిందని, ఆ సర్వే అభిప్రాయాలన్నింటిని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్‌ కృష్ణన్‌ చెప్పారు. వయసు పరిమితి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌ (ఐసీఏఎన్‌ఎన్‌) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లలు ఇంటర్నెట్‌ను వినియోగించే విషయంలో ఆస్ట్రేలియా తరహా చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లకు వయసు నిబంధనలతో పాటు డిజిటల్‌ వ్యసనాన్ని తగ్గించడానికి ఆన్‌లైన్‌ టీచింగ్‌ను కూడా తగ్గించాలని ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే సూచించింది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా వయసు ధ్రువీకరణను చేయాలని, డిజిటల్‌ వ్యసనానికి దూరంగా ఉంచేందుకు వీలుగా పిల్లలకు విద్యా విషయాలను అందించే సులువైన పరికరాలను ప్రోత్సహించాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. హానికరమైన కంటెంట్‌కు పిల్లలు ప్రభావితమవుతారని, వయసు ధ్రువీకరణ బాధ్యతను ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లే వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ సర్వే విడుదల సందర్భంగా చీఫ్‌ ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ మాట్లాడుతూ, ఇంటర్నెట్‌ వినియోగానికి వయసు నిబంధనలు తెచ్చే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్‌, గోవా ప్రభుత్వాలు ఉన్నట్లు తమకు తెలిసిందన్నారు. ఇటీవల ఘజియాబాద్‌లో ముగ్గురు బాలికలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం, కొరియా కల్చర్‌ మోజుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆన్‌లైన్‌ కంటెంట్‌కు పిల్లలను దూరంగా ఉంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Updated Date - Feb 07 , 2026 | 04:01 AM