అబూ సలేంకు పెరోల్ ఇవ్వొద్దు.. ముంబై కోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం
ABN , Publish Date - Jan 20 , 2026 | 08:02 PM
సలేం కేసులో తాము ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ అని సీబీఐ పేర్కొంటూ తమను రెస్పాండెంట్‌గా చేర్చాలని కోరింది. సలేంకు బెయిల్ కానీ, పెరోల్ కానీ ఇస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని కూడా సీబీఐ స్పష్టం చేసింది..
ముంబై: గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు (Abu Salem) పెరోల్ ఇస్తే తీవ్రమైన పరిణామాలు ఎదురుకావొచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై హైకోర్టుకు తెలిపింది. పెరోల్ ఇస్తే అతను దేశం విడిచి పారిపోవచ్చని, దీనివల్ల ఇండియా, పోర్చుగల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. తన పెద్ద సోదరుడు మృతి చెందినందున తనకు 14 రోజులు పెరోల్ ఇవ్వాలని ముంబై హైకోర్టులో అబూ సలేం పిటిషన్ వేశాడు. దీనిని మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ, మరీ అవసరం అయితే ఎమర్జెన్సీ పెరోల్ కింద రెండు రోజులకే పెరోల్‌ను పరిమితం చేయాలని సూచించింది.
న్యాయమూర్తులు ఏఎస్ గడ్కరి, శ్యామ్ చాందక్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరపింది. సలేం కేసులో తాము ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ అని సీబీఐ పేర్కొంటూ తమను రెస్పాండెంట్‌గా చేర్చాలని కోరింది. సలేంకు బెయిల్ కానీ, పెరోల్ కానీ ఇస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని కూడా సీబీఐ స్పష్టం చేసింది. దీంతో తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
సలేం అంతర్జాతీయ నేరస్థుడని, అనేక దశాబ్దాలుగా అతను నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడని జైళ్ల శాఖ ఐజీ సుహాస్ వార్కే తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఇచ్చిన నిర్దిష్ట హామీలకు అనుగుణంగానే పోర్చుగల్ నుంచి అతన్ని అప్పగించడం జరిగిందని గుర్తు చేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే 1993లో సలేం భారత్ నుంచి పారిపోయాడని, ఇప్పుడు టెంపరరీగా అతన్ని విడుదల చేసినా మళ్లీ అదే పని చేసే అవకాశం ఉందని అన్నారు. సలేంను లిస్బాన్‌లో అరెస్టు చేసి 2005 నవంబర్‌లో భారత్‌కు పంపారు. నకిలీ పాస్‌పోర్ట్‌పై ప్రయాణించిన కేసులో అతన్ని దోషిగా పోర్చుగల్ గుర్తించింది. భారత అధికారుల అభ్యర్థన మేరకు పలు షరతులతో పోర్చుగల్ అతన్ని అప్పగించింది. 1993 ముంబై గొలుసుకట్టు బాంబు పేలుళ్ల కేసుతో సహా మూడు కేసుల్లో సలేంకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని తలోజా సెంట్రల్ జైలులో సలేం ఉన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి.
టెకీ మృతి ఘటన.. నొయిడా సొసైటీ బిల్డర్ అరెస్టు
నితిన్ నబీన్‌కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ
Read Latest National News