ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు.. ఇద్దరు జవాన్లు మృతి
ABN , Publish Date - Feb 06 , 2026 | 09:51 PM
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులతోపాటు ఇద్దరు జవానులు మరణించారు.
ముంబై, ఫిబ్రవరి 06: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవానులు మరణించారు. గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ భద్రతాబలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసుల సహాయంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపైకి కాల్పులకు తెగబడ్డారు. దాంతో భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. ఈ నేపథ్యంలో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
ఇద్దరు జవాన్లు సైతం మృతి చెందారని చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో మూడు ఏకే 47 తుపాకీలతోపాటు పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అలాగే మృతుల్లో గడ్చిరోలి డివిజన్ కమిటీ ఇన్‌చార్జ్ ప్రభాకర్ మృతి చెందారని చెప్పారు. అతడిపై రూ. 25 లక్షల రివార్డు ఉందని తెలిపారు. తెలంగాణలోని కామారెడ్డి అతడి స్వస్థలమని పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే వేలాది మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. అలాగే వందలాది మంది మవోయిస్టులు ఎదురు కాల్పుల్లో మరణించారు. దేశంలో దాదాపుగా మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయనే ఒక ప్రచారం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వాట్సాప్ మీ సేవకు అత్యధిక ప్రజాదరణ: తెలంగాణ ప్రభుత్వం
భారత చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలి: డిప్యూటీ సీఎం