వాట్సాప్ మీ సేవకు అత్యధిక ప్రజాదరణ: తెలంగాణ ప్రభుత్వం
ABN , Publish Date - Feb 06 , 2026 | 08:27 PM
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ మీ సేవ విధానానికి అత్యధిక ప్రజాదరణ లభించిందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 3.25 లక్షల మందికి డిజిటల్ పౌర సేవలు అందినట్లు వివరించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 06: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ మీ సేవ విధానానికి అత్యధిక ప్రజాదరణ లభించిందని కాంగ్రెస్ సర్కార్ శుక్రవారం వెల్లడించింది. దీంతో ఇప్పటివరకూ 3.25 లక్షల మందికి డిజిటల్ పౌర సేవలు అందినట్లు వివరించింది. ఈ వాట్సాప్‌లో 4.5 లక్షల మంది నమోదు చేసుకోగా.. 3.25 లక్షల మంది ఈ సేవలు పొందినట్లు గణాంకాలతో సహా విశదీకరించింది. కాగా, 24 గంటలపాటు 8096958096 వాట్సాప్ నంబర్ ద్వారా సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పది కంటే ఎక్కువ శాఖలకు చెందిన 581 రకాల సేవలను ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా అందుబాటులో తీసుకువచ్చింది.
క్యాస్ట్, ఆదాయం, బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం ఈ వాట్సాప్ నెంబర్‌ను అత్యధికంగా వినియోగించినట్లు గుర్తించింది. మీ సేవా స్టేటస్, సర్టిఫికేట్ డౌన్‌లోడ్ అన్నీ వాట్సాప్‌లోనే పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పదే పదే మీ సేవా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా ఈ సేవలు అందిస్తోందని వివరించింది. 2025 నవంబర్ 18వ తేదీన ఈ సేవలను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు.
డిజిటల్ అవగాహన లేని వారికీ సులభంగా ఈ సేవలు అందిస్తోంది. అలాగే ఈ వాట్సాప్ మీ సేవ ద్వారా 31 దేవాలయ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేవుని దర్శనం, వసతితోపాటు సేవలన్నీ ఈ వాట్సాప్‌లోనే బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక రానున్న రోజుల్లో 108, 101, 102 ఎమర్జెన్సీ సేవలను సైతం ఈ వాట్సాప్ నెంబర్‌కు అనుసంధానం చేయనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 5వేలకు పైగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో రోజుకు 80 వేల నుంచి లక్ష మంది వరకూ సేవలు పొందుతున్నారు. 2023 నవంబర్ 1 నుంచి 2026 జనవరి 31వ తేదీ వరకూ 5.98 కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపింది. వాటి విలువ రూ.3,811 కోట్లు ఉందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీలో తప్పులు చేసిన వారికి శిక్షలు తప్పవు: ఎల్వీ సుబ్రహ్మణ్యం
ఇబ్రహీంపట్నంలో జగన్ అభిమానుల హల్‌చల్