Share News

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

ABN , Publish Date - Aug 28 , 2026 | 03:35 PM

రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారంతా తప్పని సరిగా మరాఠి భాష నేర్చుకోవాలంటూ విధించిన నిబంధన గడువును మరో ఏడాది పాటు పొడిగించింది.

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
Maharashtra CM Devendra Fadnavis

న్యూఢిల్లీ, ఆగస్టు 28: రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారంతా తప్పని సరిగా మరాఠి భాష నేర్చుకోవాలంటూ విధించిన నిబంధన గడువును మరో ఏడాది పాటు పొడిగించింది. శనివారం ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆటో, ట్యాక్సీ యూనియన్ల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తమ సమస్యలను సీఎం దృష్టికి ఈ బృందం తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం పైవిధంగా నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఫడ్నవీస్ నిర్ణయాన్ని ముంబై ట్యాక్సీమెన్ అసోసియేషన్, సేవా సారథి యూనియన్లు స్వాగతించాయి.


డ్రైవర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం తాజా నిర్ణయంతో ఉపాధి కోల్పోతామనే భయం నుంచి డ్రైవర్లకు బిగ్ రిలీఫ్ లభించినట్లు అయింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లంతా మరాఠీ భాష నేర్చుకోవాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఆ గడువు.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీతో ముగిసింది. దాంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆటో, ట్యాక్సీ బృందాలు ఈ రోజు సమావేశమై.. తమ సమస్యలను ఆయన దృష్టికి నేరుగా తీసుకెళ్లాయి. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం ఫడ్నవీస్.. మరాఠీ నేర్చుకునేందుకు గడువు తేదీని పొడిగించారు.


అయితే మరాఠి భాష పరిజ్ఞానం లేదంటూ ఆగస్టు 20వ తేదీన 1,268 మంది డ్రైవర్లకు ఆర్టీవో అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో.. ఈ చర్యలను పూర్తిగా నిలిపివేశారు. దాంతో ఆర్టీవో అధికారులపై ఒత్తిడి పూర్తిగా తగ్గింది. మరో వైపు ముంబైలో 20,000 మంది డ్రైవర్లకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే సర్టిఫికెట్లు అందజేశారు.


ఇంకో వైపు ఆటో, ట్యాక్సీ యూనియన్ల ఆధ్వర్యంలో మరాఠీ బోధన తరగతులను ఏర్పాటు చేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పినట్లు అయింది. అయితే వయోభారం వల్ల మరాఠీ భాష నేర్చుకోవడం కష్టంగా మారిందని పలువురు సీనియర్ సిటిజన్ డ్రైవర్లు వెల్లడించారు.


ఈ భాష నేర్చుకునేందుకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇవ్వడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక 'వర్కింగ్ నాలెడ్జ్' అంటే ఏమిటో స్పష్టత ఇవ్వలేదని రవాణా మాజీ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ నివాసంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు..

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

For More National News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 03:51 PM