Share News

ఎగ్జామ్‌కు ముందే పేపర్ లీక్.. వాట్సాప్‌లో క్వశ్చన్ పేపర్, ఆన్సర్లు

ABN , Publish Date - Feb 21 , 2026 | 09:56 PM

మహారాష్ట్రలో బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణ లోపాలు మరోసారి తేటతెల్లం అయ్యాయి. ఆ రాష్ట్ర బోర్డు నిర్వహించే 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్, ఆన్సర్లు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది.

ఎగ్జామ్‌కు ముందే పేపర్ లీక్.. వాట్సాప్‌లో క్వశ్చన్ పేపర్, ఆన్సర్లు
Board Exam Q.P leak

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో ప్రశ్నాపత్రం లీకేజీ మరోసారి కలకలం రేపింది. ఆ రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి 12వ తరగతి(ఇంటర్మీడియట్) పరీక్షలు ప్రారంభం కాగా.. రసాయన శాస్త్రం(Chemistry) క్వశ్చన్ పేపర్ లీకైంది. ఎగ్జామ్‌కు ముందే వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టడం ఆ రాష్ట్ర బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణ తీరుపై ఆందోళన రేకెత్తిస్తోంది. అసలేం జరిగిందంటే...

మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్(12 తరగతి) పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 18న కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉండగా.. పరీక్ష సమయానికి ముందే ప్రశ్నాపత్రం పేపర్ సోషల్ మీడియాలో కనిపించినట్టు ‌నాగ్‌పు‌ర్‌లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఈ నెల 20న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఓ ఉన్నత పాఠశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థి పదే పదే వాష్ రూమ్‌కు వెళ్లడాన్ని ఇన్విజిలేటర్లు గమనించారు. అనుమానం వచ్చి చెక్ చేయగా.. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్టు తేలింది. వాష్ రూమ్‌లో ఆ విద్యార్థి ఉంచిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసినట్లు గుర్తించారు. అదే గ్రూప్‌లో సమాధానాలు కూడా ఉన్నట్టు సమాచారం. ఓ ప్రైవేట్ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో సంబంధమున్న వ్యక్తి డబ్బులిచ్చి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు.


మహారాష్ట్ర బోర్డు పరీక్షల్లో అక్రమాలు జరగడం ఇదేం తొలిసారి కాదు. శంభాజీ నగర్‌లో ఈ నెల 12న జరిగిన 12వ తరగతి పరీక్షల్లో విద్యార్థులంతా కాపీలకు పాల్పడ్డారు. ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. టీచర్ల సమక్షంలోనే విద్యార్థులు బహిరంగంగా చూచిరాతకు పాల్పడిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అయితే పరీక్షల్లో పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై మాల్ ప్రాక్టీసెస్ నిరోధక చట్టం 1982 కింద కేసు నమోదు చేస్తామని బోర్డు అధికారులు వెల్లడించారు.


మధ్యప్రదేశ్‌లోనూ పేపర్ షేరింగ్

మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌ను తన వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేసినందుకు ఓ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు అక్కడి అధికారులు. అయితే ఆ ప్రశ్నాపత్రం లీక్ అవ్వలేదని అధికార యంత్రాంగం ఆ తర్వాత స్పష్టం చేసింది. పరీక్ష ప్రారంభమయ్యాక ఉదయం 9:06 గంటలకు ఆ టీచర్.. ప్రశ్నాపత్రం ఫొటోను అప్‌లోడ్ చేశారని అధికారులు తెలిపారు. ఉదయం 8:40 గంటలకు ముందే విద్యార్థులంతా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించారని వారు పేర్కొన్నారు. అయినప్పటికీ బోర్డు నిబంధనలను ఉల్లంఘించినందుకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెను విధుల నుంచి తొలగించారు.


ఇవీ చదవండి:

'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'

ట్రంప్ టారిఫ్‌‌ల రద్దుపై భారత్ తొలి స్పందన ఇదే..

Updated Date - Feb 21 , 2026 | 09:57 PM