Share News

స్కూల్స్ సమీపంలో జంక్ ఫుడ్‌‌పై నిషేధం.. FDA సంచలన ఉత్తర్వులు

ABN , Publish Date - Jul 30 , 2026 | 09:01 AM

పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాల ప్రాంగణాల్లోనూ, వాటికి 50 మీటర్ల పరిధిలోనూ జంక్ ఫుడ్ విక్రయం, ఉచిత పంపిణీ, ప్రచారాలను పూర్తిస్థాయిలో నిషేధించింది.

స్కూల్స్ సమీపంలో జంక్ ఫుడ్‌‌పై నిషేధం..  FDA సంచలన ఉత్తర్వులు
Maharashtra Bans Vada Pav, Samosa and Junk Food In and Around Schools

ముంబై, జులై 30: పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాల ప్రాంగణాల్లోనూ, వాటికి 50 మీటర్ల పరిధిలోనూ జంక్ ఫుడ్ విక్రయం, ఉచిత పంపిణీ, ప్రచారాలను పూర్తిస్థాయిలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు CBSE, ICSE, స్టేట్ బోర్డ్, ఇతర ఏ బోర్డుకు చెందిన విద్యాసంస్థలకైనా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 1.08 లక్షల పాఠశాలలు, సుమారు రెండు కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది.


నిషేధిత ఆహార పదార్థాలు

ఎక్కువ మోతాదులో కొవ్వు (Fat), ట్రాన్స్-ఫ్యాట్, షుగర్ , ఉప్పు ఉండే ఆహార పదార్థాలను (HFSS Foods) పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో అమ్మకూడదు. ఈ జాబితాలో ప్రముఖంగా:

  • వడాపావ్, సమోసాలు వంటి జంక్ ఫుడ్

  • నూనెలో తీవ్రంగా వేగించిన పదార్థాలు (Deep-fried snacks)

  • చిప్స్, కూల్ డ్రింక్స్, తీపి పానీయాలు

  • చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు

ఈ సందర్భంగా మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారామ్ ముండే మాట్లాడుతూ ఇది 'సేఫ్ ఫుడ్, సేఫ్ మహారాష్ట్ర' కార్యక్రమంలో భాగమని తెలిపారు. ప్రతి బిడ్డకూ సురక్షితమైన, పోషకాహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


పాఠశాల క్యాంటీన్లకు కొత్త నిబంధనలు

పాఠశాల క్యాంటీన్లు, హాస్టల్ మెస్‌లు, మధ్యాహ్న భోజన (PM-POSHAN) వంటశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు ఆహారాన్ని సరఫరా చేసే ఏజెన్సీలన్నీ తప్పనిసరిగా FSSAI లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

పాఠశాల యాజమాన్యాలు తీసుకోవాల్సిన చర్యలు

1. పాఠశాలల్లో 'ఫుడ్ సేఫ్టీ డిస్‌ప్లే బోర్డు' ఏర్పాటు చేయాలి.

2. ఒక 'ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్' ను నియమించాలి.

3. 'ఈట్ రైట్ స్కూల్' (Eat Right School) ప్రచారాన్ని అమలు చేయాలి.

4. తాగునీరు, వంటశాలల పరిశుభ్రత, ఆహార నిల్వ విషయంలో కఠిన ప్రమాణాలు పాటించాలి.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 10:15 AM