పాకిస్థాన్‌కు మద్దతుగా నిలబడదాం.. బీజేపీ నేత వ్యాఖ్యలు వైరల్..
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:30 PM
రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మదన్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. అమెరికా, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగితే పాక్‌కు భారత్ మద్దతుగా నిలుస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించాయి.
జైపూర్: రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మదన్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. అమెరికా, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగితే పాక్‌కు భారత్ మద్దతుగా నిలుస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. అయితే, తన వ్యాఖ్యలను వక్రీకరించారని, అవి భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంలో చేసినవని మదన్ రాథోడ్ వివరణ ఇచ్చారు.
అక్టోబర్ 15న జైపూర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్ రాథోడ్ ప్రసంగిస్తూ పొరుగు దేశాలతో భారత్ వ్యవహరించే తీరుపై మాట్లాడారు. ‘భారతదేశం విషయానికి వస్తే.. ఈ రోజు అమెరికా, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం చెలరేగితే పాక్ మన పొరుగు దేశం కాబట్టి మనం దానికి అండగా నిలబడతాం. కానీ మనలో మనకే సమస్య వచ్చినప్పుడు, మనం భారతదేశానికి అండగా నిలబడతాం కదా? ఈ విషయాన్ని మనమందరం అర్థం చేసుకోవాలి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
కాంగ్రెస్, ఆప్ తీవ్ర విమర్శలు
మదన్ రాథోడ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ తీవ్రంగా స్పందించారు. ఆయనను దేశద్రోహిగా షమా అభివర్ణించారు. భారత సైనికులు, పౌరుల ప్రాణాలను బలిగొన్న పాకిస్థాన్ విషయంలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరమని విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించాలని, రాథోడ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. సామాన్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరిస్తారని, అదే బీజేపీ నాయకుడు పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడితే ఆ పార్టీ జాతీయవాదం ఏమైందని ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
మదన్ రాథోడ్ వివరణ..
ఈ వివాదం ముదరడంతో మదన్ రాథోడ్ వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పుడు కొందరు బాణసంచా కాల్చడం దేశభక్తికి విరుద్ధమనే అంశంపై తాను మాట్లాడానని ఆయన తెలిపారు. తన ప్రసంగంలోని చివరి కొన్ని వాక్యాలను మాత్రమే తీసుకుని, తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేశారని పేర్కొన్నారు. భారత్-పాక్ సంబంధాలపై బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మదన్ రాథోడ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
భర్తపై ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య సంచలన ఆరోపణలు..
పునర్విభజన బిల్లుపై కేంద్రం కసరత్తు.. ప్రత్యేక సమావేశం దిశగా అడుగులు..?