Share News

భర్తపై ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య సంచలన ఆరోపణలు..

ABN , Publish Date - Oct 16 , 2026 | 09:05 AM

ఉత్తరాఖండ్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి రేఖా ఆర్య తన భర్త గిర్ధారి లాల్ సాహుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై దాడి చేయడంతోపాటు కులం పేరుతో దూషించారని, తనను, తన పిల్లలను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను వెల్లడిస్తూ మంత్రి రేఖా ఆర్య సోషల్ మీడియాలో వీడియో పెట్టడం సంచలనంగా మారింది.

భర్తపై ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య సంచలన ఆరోపణలు..
Uttarakhand Minister Rekha Arya

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి రేఖా ఆర్య తన భర్త గిర్ధారి లాల్ సాహుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై దాడి చేయడంతోపాటు కులం పేరుతో దూషించారని, తనను, పిల్లలను చంపేందుకు కుట్ర పన్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను వెల్లడిస్తూ మంత్రి రేఖా ఆర్య సోషల్ మీడియాలో వీడియో పెట్టడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా తన భర్త సాహుకు సంబంధించిన ఓ ఆడియో తీవ్రంగా కలచివేసిందని ఆమె పేర్కొన్నారు. సాహు మరో మహిళతో మాట్లాడుతూ తనను హత్య చేసే కుట్ర గురించి ప్రస్తావించారని మంత్రి తెలిపారు. తన పిల్లల భద్రత కోసం పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.


రేఖా ఆర్య ఫిర్యాదు ప్రకారం.. గిర్ధారి లాల్ సాహుతో ఆమెకు 2004 జులై 6న హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో తనకు అంతకుముందు వివాహం కాలేదని సాహు చెప్పారని పేర్కొన్నారు. అయితే, కొన్నేళ్ల తర్వాత ఆయనకు గతంలోనే వివాహమైందని, పిల్లలూ ఉన్నారని తెలిసిందని ఫిర్యాదులో వెల్లడించారు. తన భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల తెలుసుకున్నానని, దీనిపై ప్రశ్నించినప్పుడు తనపై దాడి చేశారని, దూషించారని, చంపేస్తానని బెదిరించారని రేఖా ఆర్య ఆరోపించారు. తన ప్రభుత్వ నివాసంలో సిబ్బంది ఎదుటే పలుమార్లు కులం పేరుతో దూషించారని పేర్కొన్నారు.


కొన్ని కంపెనీల్లో డైరెక్టర్ పదవి నుంచి తనను తొలగించేందుకు తన సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాలను సృష్టించారని మంత్రి రేఖా ఆరోపించారు. తాను అలాంటి పత్రాలపై సంతకాలు చేయలేదని, రాజీనామా కూడా సమర్పించలేదని స్పష్టం చేశారు. సాధారణ మహిళలైనా, ప్రముఖులైనా గృహ హింసను భరించకుండా, అన్యాయాన్ని బయటపెట్టాలని రేఖా ఆర్య తన వీడియోలో పిలుపునిచ్చారు. కాగా, మంత్రి ఫిర్యాదు ఆధారంగా డెహ్రాడూన్‌ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంతో పాటు నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, బహుభార్యత్వం, క్రూరత్వం, దాడి, బెదిరింపులు వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ ఘటనపై ఉత్తరాఖండ్ కాంగ్రెస్ స్పందించింది. రాష్ట్ర మంత్రే తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడంఆందోళనకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమా మెహ్రా దసౌనీ పేర్కొన్నారు. ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, ఆడియో రికార్డింగ్‌లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాలని, ఆరోపణలు రుజువైతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

వాయుసేనకు జీశాట్‌-7సీ, నేవీకి వరుణాస్త్రాలు

‘సర్‌’పై కాంగ్రెస్‌ పోరాటం ఆగదు

Updated Date - Oct 16 , 2026 | 10:31 AM