Share News

వాయుసేనకు జీశాట్‌-7సీ, నేవీకి వరుణాస్త్రాలు

ABN , Publish Date - Oct 16 , 2026 | 06:26 AM

వాయుసేన, నౌక దళాల శక్తి, సామర్థ్యాలను మరింత పెంచేలా భారత ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. భారత వాయు సేన కోసం ప్రత్యేకంగా పని చేసేలా ఓ శాటిలైట్‌ వ్యవస్థతోపాటు నౌకా దళం కోసం హెవీ వెయిట్‌ టార్పిడోలను సమకూర్చుకునేందుకు సిద్ధమైంది.

వాయుసేనకు జీశాట్‌-7సీ, నేవీకి వరుణాస్త్రాలు

  • రూ.4106 కోట్లతో రక్షణ శాఖ కీలక ఒప్పందాలు

  • వరుణాస్త్ర టార్పిడోల కోసం హైదరాబాద్‌ సంస్థతో కాంట్రాక్టు

న్యూఢిల్లీ, అక్టోబరు 15 : వాయుసేన, నౌక దళాల శక్తి, సామర్థ్యాలను మరింత పెంచేలా భారత ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. భారత వాయు సేన కోసం ప్రత్యేకంగా పని చేసేలా ఓ శాటిలైట్‌ వ్యవస్థతోపాటు నౌకా దళం కోసం హెవీ వెయిట్‌ టార్పిడోలను సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రూ.4,106 కోట్ల విలువైన ఒప్పందాలపై రక్షణ శాఖ గురువారం సంతకాలు చేసింది. ఇందులో వాయు సేన కోసం జీశాట్‌-7సీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం కోసం బెంగళూరుకు చెందిన నూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థతో రూ.2563 కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన జీశాట్‌-7సీ ఉపగ్రహం ద్వారా భారత వాయుసేనలోని సమాచార వ్యవస్థ మరింత సురక్షితం, బలోపేతం అవుతుందని రక్షణ శాఖ పేర్కొంది. అలాగే, వరుణాస్త్ర టార్పిడోల కోసం హైదరాబాద్‌కు చెందిన భారత్‌ డైనమిక్స్‌తో రూ.1,543 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబోరెటరీ దేశీయంగా అభివృద్ధి చేసిన వరుణాస్త్ర టార్పిడోలను యుద్ధనౌకల నుంచి సముద్ర గర్భంలో ఉన్న జలాంతర్గాములపైకి ప్రయోగించేలా రూపొందించారు. అధునాతన దిశ మార్పు(మనువరింగ్‌) సామర్థ్యం కలిగిన వరుణాస్త్ర టార్పిడోలు సుదూర ప్రాంతాల్లో నీళ్లలో తిరుగుతున్న జలాంతర్గాములను కూడా ఛేదించగలవు. ఈ టార్పిడోలను సమకూర్చడంతో నేవీ శక్తి, సామర్థ్యాలు మరింత పెరుగుతాయని రక్షణ శాఖ పేర్కొంది.

Updated Date - Oct 16 , 2026 | 06:28 AM