Share News

‘సర్‌’పై కాంగ్రెస్‌ పోరాటం ఆగదు

ABN , Publish Date - Oct 16 , 2026 | 06:30 AM

‘సర్‌’ ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ చేసే ఈ పోరాటంలో..

‘సర్‌’పై కాంగ్రెస్‌ పోరాటం ఆగదు

  • మెరుపు నిరసనలకు సిద్ధంగా ఉండాలి యువజన, విద్యార్థి నాయకులతో రాహుల్‌ గాంధీ

  • తెలంగాణ అమ్మాయి అనులేఖకు ప్రశంసలు

న్యూఢిల్లీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘సర్‌’ ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ చేసే ఈ పోరాటంలో ఆ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల పాత్ర కీలమని అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగే మెరుపు నిరసనలకు సిద్ధంగా ఉండాలని యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ(నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా) విభాగాలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ యువజన, విద్యార్థి సంఘాలు, సేవాదళ్‌కు చెందిన 70 మంది ముఖ్య ప్రతినిధులతో రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అఽధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, లోక్‌సభ ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులు గురువారం సమాలోచనలు జరిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు నిర్వహించిన నిరసనల్లో పాల్గొన్ని ధైర్యంగా పోరాడిన వారిని రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా అభినందించారు. నిరసన ప్రదర్శనల్లో తెగువ ప్రదర్శించిన ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శి, కేరళ విద్యార్థి సంఘం ఇన్‌చార్జి అయిన తెలంగాణ యువతి అనులేఖ బూసాను ప్రత్యేకంగా అభినందించారు. పోలీసులు తనను ఈడ్చుకెళ్లినప్పుడు తన కుడి చెయ్యి కి తీవ్ర గాయమైందని, ఆ చెయ్యిని ఇప్పటికీ లేపలేకపోతున్నానని బూసా వివరించారు.


అయితే రాహుల్‌, ప్రియాంక ప్రదర్శనలో ముందు నిలిచి తమకు మనోబలాన్ని కల్పించారని, 84 ఏళ్ల వయసులో మల్లిఖార్జున ఖర్గే ప్రదర్శనలో పాల్గొనడం తమకు ప్రేరణ కలిగించిందని అనులేఖ బూసా సమావేశంలో చెప్పారు. కాగా, ఖర్గే కూడా ఉద్యమంలో ముందు నిలిచిన యువతను అభినందించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరును తీవ్రతరం చేయాలని, యువతను అణిచివేయాలని చూస్తున్న మోదీ ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - Oct 16 , 2026 | 06:32 AM