ట్రిపుల్ మర్డర్ కలకలం.. 22 సెకన్లలో 5 రౌండ్లు కాల్పులు..
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:31 PM
ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఈనెల 26న ట్రిపుల్ మర్డర్ జరిగిన సంగతి తెలిసిందే. సాదత్గంజ్ ప్రాంతంలో పార్కింగ్ స్థలం వివాదం కారణంగా జరిగిన ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఈనెల 26న ట్రిపుల్ మర్డర్ జరిగిన సంగతి తెలిసిందే. సాదత్గంజ్ ప్రాంతంలో పార్కింగ్ స్థలం వివాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ భయానక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియోలో నిందితుడు 22 సెకన్ల వ్యవధిలో ఐదు సార్లు కాల్పులు జరిపాడు. అంతేకాక దాడి చేసే మధ్యలో తుపాకీని రీలోడ్ కూడా చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
లఖ్‌నవూలోని సాదత్గంజ్ ప్రాంతంలో అక్టోబర్ 26న కారు పార్కింగ్ విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన 30 ఏళ్ల శుక్లా అనే వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శివాజీ తివారీ (62), శివేంద్ర తివారీ (55), సుయాశ్ తివారీ (30) అనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వారిని వెంటనే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) ట్రోమా సెంటర్‌కు తరలించారు. అయితే అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించి ఇవాళ(గురువారం) ఓ వీడియో బయటకు వచ్చింది. అందరూ చూస్తుండగా నిందితుడు శుక్లా కేవలం 22 సెకన్ల వ్యవధిలో ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వీడియోలో కనిపించింది. రెండు రౌండ్లు కాల్చి.. అనంతరం గన్ను రీలోడ్ చేసి మరో మూడు బులెట్లు కాల్చినట్లు ఆ క్లిప్‌లో ఉంది. 'నన్ను ఇటుకతో కొట్టారు. అందుకే కాల్చాను' అని నిందితుడు అనడం ఆ వీడియోలో రికార్డైంది.
ఈ దారుణ ఘటనపై మృతుడు శివేంద్ర తివారీ భార్య రుచి తివారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. ప్రధాన నిందితుడు శుక్లా మర్చంట్ నేవీలో నావిగేషన్ ఆఫీసర్‌గా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి వద్ద నుంచి తుపాకీతో పాటు నాలుగు బులెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
హైవేపై బర్త్‌డే హంగామా.. కార్లపై స్టంట్లు చేసిన 8 మంది అరెస్ట్!
టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!
కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!