లోక్‌సభ మళ్లీ వాయిదా..
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:16 PM
లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం ప్రారంభమైన సభ పలుమార్లు వాయిదా పడింది. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చి జరగాలంటూ విపక్ష పార్టీల సభ్యులు పట్టుపడుతున్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 04: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బడ్జెట్‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో బుధవారం సైతం సభ పలుమార్లు వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చి జరగాలంటూ విపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో మధ్యాహ్నం 12.00 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
విపక్ష సభ్యులంతా పార్లమెంట్ మెట్ల మీదకు చేరుకుని.. ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విలేకర్లతో మాట్లాడుతూ.. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాసిన లేఖకు తాము సమాధానం ఇచ్చామన్నారు. కానీ ఆయన ఏకపక్షంగా మాట్లాడుతున్నారంటూ రాహుల్ తీరుపై కిరణ్ రిజిజు మండిపడ్డారు. సభ 12.00 గంటలకు ప్రారంభమైంది. సభలో సభ్యుల తీరు మారలేదు. భారత్, అమెరికా ఒప్పందంపై కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ మధ్యాహ్నం 2.00 గంటలకు సభలో సమాధానం ఇస్తారని ప్రకటించిన అనంతరం సభను వాయిదా వేశారు.
మళ్లీ సభ ప్రారంభమైన అనంతరం భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై సభలో మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. విపక్ష సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. దాంతో సాయంత్రం 5.00 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
మరోవైపు రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అంటే.. బుధవారం లోక్‌సభలో ధన్యవాదాలు తెలపనున్నారు. లోక్‌సభలో ఈ రోజు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇంకోవైపు ప్రధాని సభకు వస్తే.. ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన పుస్తకాన్ని ఆయనకు తాను స్వయంగా అందజేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆ పుస్తకాన్ని పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ప్రధాని మోదీ భయపడ్డారని.. ఈ రోజు ఆయన సభకు రారంటూ రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.
నరవణె పుస్తకంలోని అంశాలపై చర్చించాలంటూ మంగళవారం నాడు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. ఆయనకు మద్దతుగా 8మంది ఎంపీలు స్పీకర్ ఎదుట నిరసనకు దిగారు. ఆ క్రమంలో కాగితాలను చించి స్పీకర్‌పైకి వారు విసిరారు. ఈ నేపథ్యంలో సదరు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ మధ్య వాగ్వాదం..
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు.. దాడులు తీవ్రతరం చేసిన రష్యా..
For More National News And Telugu News