లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు!
ABN , Publish Date - Nov 28 , 2026 | 03:12 AM
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు కోసం రూపొందించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర మంత్రిమండలి శుక్రవారం ఆమోదించింది.
అన్ని రాష్ట్రాల శాసనసభ స్థానాలు కూడా..
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఓకే
ప్రస్తుతమున్న 543 సీట్లు గరిష్ఠంగా 850కి పెంపు
ఎమ్మెల్యేల సంఖ్య పరిమితిని 500 నుంచి 650కి పెంచే వీలు
అందులో మహిళలకు 33శాతం రిజర్వు.. 2029 నుంచి అమలు
2011 జనాభా లెక్కలతోనే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ
2051 వరకు మళ్లీ సీట్లలో మార్పులు చేయరాదని ప్రతిపాదన
ముసాయిదా విడుదల.. 30న లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు
లోక్‌సభలో ఏ రాష్ట్ర ప్రాతినిథ్యం తగ్గదని కేంద్రం భరోసా
సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించండి: రిజిజు
బిల్లు ఆమోదానికి మద్దతు కోసం బీజేపీ అగ్రనేతల యత్నాలు
డీఎంకే, ఎన్‌సీపీ (పవార్) పార్టీల మద్దతుపై ఆశలు
ఇండి కూటమి పార్టీల సభ్యుల్ని గైర్హాజరు చేయించే వ్యూహాలు
న్యూఢిల్లీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు కోసం రూపొందించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర మంత్రిమండలి శుక్రవారం ఆమోదించింది. లోక్‌సభ నియోజకవర్గాలు ప్రస్తుతం 543 ఉండగా.. వాటిని గరిష్ఠంగా 850కి పెంచాలని ప్రతిపాదించారు. ప్రతి రాష్ట్రంలోనూ లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలని నిర్ణయించారు. ప్రధాని కార్యాలయం సేవా తీర్థ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. అనంతరం బిల్లుకు సంబంధించిన ముసాయుదాను ప్రభుత్వం విడుదల చేసింది. నియోజకవర్గాల పెంపు కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టగా తగినంత మందిసభ్యుల మద్దతు లభించకపోవటంతో ఆమోదం పొందని విషయం తెలిసిందే.
తాజాగా నాటి బిల్లులోని కొన్ని అంశాలను సవరించి కొత్తగా కేంద్రం బిల్లును రూపొందించింది. గత బిల్లులో అన్ని రాష్ట్రాల్లో సీట్లను 50 శాతం పెంచటంపై స్పష్టత ఇవ్వకపోవటంతో అనేక పార్టీలు దానిని వ్యతిరేకించాయి. తాజా బిల్లులో దీనిపై స్పష్టత ఇచ్చారు. ఈ బిల్లు ఆమోదం ద్వారా సీట్లను పెంచిన తర్వాత 2051 వరకు వాటిలో మళ్లీ మార్పులు చేయరాదని ప్రతిపాదించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల్లో నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. నియోజకవర్గాల పునర్విభజనతోపాటు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రతిపాదించారు. డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయం మేరకు మహిళా రిజర్వేషన్ రొటేషన్ అమలు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ స్థానాలను కూడా 50 శాతం చొప్పున పెంచాలని ప్రతిపాదించారు. ఇందుకు రాష్ట్రంలో ఎమ్మెల్యేల గరిష్ఠ సంఖ్య ప్రస్తుతం 500 ఉండగా.. వాటిని 650కి పెంచే వీలు కల్పించారు. ఈ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబరు 3 వరకు నాలుగు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. కాగా, ఈ బిల్లును ఈ నెల 30న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో గతంలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉపసంహరించుకోనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు.
రాష్ట్రాల ప్రాతినిధ్యంపై భయాలు వద్దు: కేంద్రం
నియోజకవర్గాల పునర్విభజనతో లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గబోదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. ప్రతి రాష్ట్రానికి సభలో ప్రస్తుతం ఎంతశాతం ప్రాతినిధ్యం ఉందో.. సీట్ల పెంపు తర్వాత కూడా అంత శాతం కొనసాగుతుందని పేర్కొన్నాయి. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు ద్వారా ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేలా ప్రతి సభ్యుడు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనకు ఉన్న గుర్తింపును, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందని పేర్కొన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామంటే.. అందులో ప్రవేశపెట్టే బిల్లులు దేశానికి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలని కోరారు. కాగా, ఈ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి శనివారం సమావేశం అవుతున్నట్లు తెలిసింది.
360 మంది మద్దతు ఉంటేనే...
లోక్‌సభలో మొత్తం 543 స్థానాలకుగాను ప్రస్తుతం మూడు ఖాళీలు పోగా 540 మంది సభ్యులున్నారు. వీరందరూ ఓటు వేస్తే.. బిల్లు ఆమోదానికి రెండింట మూడో వంతు మెజారిటీగా 360 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. కాగా, ఎన్‌డీఏకు ఇప్పటికే 321 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరిలో బీజేపీ సభ్యులు 240 మంది ఉండగా, టీడీపీ-16, జేడీయూ-12, శివసేన (ఏక్‌నాథ్ షిండే)-13తోపాటు లోక్‌జనశక్తి (రాంవిలాస్ పాశ్వాన్), నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ (టీఎంసీ చీలిక వర్గం), శిరోమణి అకాలీదళ్, అప్నాదళ్, అసోం గణపరిషత్ వంటి చిన్నాచితక పార్టీలు, స్వతంత్రులు ఉన్నారు. వీరు కాకుండా నలుగురు సభ్యులున్న వైసీపీ కూడా ఎన్డీఏకు మద్దతు తెలపక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదానికి అధికార పక్షానికి మరో 35 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుందని చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్యను కూడగట్టేందుకు తమకు రెండు కీలక మార్గాలున్నాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా 22 మంది సభ్యులున్న డీఎంకే, 8 మంది సభ్యులున్న ఎన్‌సీపీ (శరద్‌పవార్ వర్గం) తమకు మద్దతిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశాయి. లోక్‌సభలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం సీట్ల వాటా తగ్గకూడదని, దీంతోపాటు ఈ పెంపును మరో 25 ఏళ్లపాటు అలాగే కొనసాగించాలన్నవే తమ డిమాండ్లు అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అంటున్న విషయం తెలిసిందే. తాజా బిల్లులో ప్రతిపాదించిన 50 శాతం పెంపు ప్రకారం లోక్‌సభలో తమిళనాడు సీట్ల వాటా 7.23 శాతానికి పెరుగుతుండడం, 2051 వరకు వీటిని అలాగే కొనసాగించనుండడంతో బిల్లుకు డీఎంకే మద్దతు తెలుపుతుందన్న విశ్వాసంతో అధికార పక్షం ఉంది. అంతేకాదు.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలిపినందుకుగాను త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో డీఎంకేకు చోటు కల్పించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ కనిమొళికి మంత్రివర్గంలో స్థానం ఖాయమని పేర్కొన్నాయి.
మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కూడా మంతనాలు జరిగాయని, ఈ పార్టీ నుంచి పవార్ కుమార్తె సుప్రియా సూలేకు కేంద్ర మంత్రిపదవి లభిస్తుందని ఆ వర్గాలు చెప్పాయి. సుప్రియ సైతం డీలిమిటేషన్ బిల్లును పరిశీలించాక తమ నిర్ణయం ఉంటుందని అనడం.. బిల్లుకు మద్దతిస్తామని సంకేతమిచ్చినట్లేనని అంటున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగిన కొద్ది రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని చెబుతున్నారు.
గైర్హాజరు.. క్రాస్ ఓటింగ్ సైతం..
లోక్‌సభలో బిల్లు ఆమోదానికి అవసరమైన మెజారిటీ సాధించేలా మరో వ్యూహాన్ని సైతం బీజేసీ అగ్రనేతలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 540 మంది సభ్యుల్లో కొందరు గైర్హాజరయ్యేలా, మరికొందరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడేలా చేసేందుకు వ్యూహరచన చేసినట్లు సమాచారం. ప్రధానంగా సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ, జేఎంఎం, శివసేన (ఠాక్రే వర్గం) ఎంపీలను గైర్హాజరు చేయించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెబుతున్నారు. ఇక 98 మంది సభ్యులున్న కాంగ్రెస్ నుంచి పలువురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ బిల్లు ఆమోదంతో ఇండియా కూటమి కూడా దాదాపు చీలిపోయినట్లవుతుందని, ఈ కూటమిలో లుకలుకలు ప్రస్ఫుటమవుతాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్షాలను చీల్చడం ద్వారానే బీజేపీ ఈ రాజ్యాంగ సవరణకు మద్దతు సాధించే ప్రయత్నం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఆరోపించారు. అనర్హత వేటుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న 20 మంది తృణమూల్ ఎంపీలు, ఆరుగురు శివసేన ఎంపీలు తమ సభ్యత్వాలు ప్రశ్నార్థకమైనా ఓటింగ్‌లో పాల్గొంటున్నారని చెప్పారు. తృణమూల్ ఎంపీలపై అనర్హత వేటు వేసే విషయం స్పీకర్ ఓం బిర్లా ముందు పెండింగ్‌లో ఉన్నందువల్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారికి నోటీసులు జారీ చేసి ఊరుకున్నారు.
30న లోక్‌సభలో బిల్లు.. 1న ఆమోదం!
పార్లమెంట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 30నే లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడతారని, రాత్రి పొద్దుపోయే వరకు చర్చ జరిపి డిసెంబరు 1న ఆమోదిస్తారు. అనంతరం డిసెంబరు 2, 3 తేదీల్లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతుంది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతి రాష్ట్రానికీ 50 శాతం సీట్లు పెరుగుతాయి. మొత్తం సీట్లు 850 లోపే ఉంటాయి. వీటిలో 33 శాతం మహిళలకు కేటాయిస్తారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే దేశవ్యాప్తంగా మహిళలతో విజయోత్సవాలు జరిపించాలని బీజేపీ భావిస్తోంది.
బిల్లు ఆమోదానికి
ప్రాంతీయ పార్టీలే కీలకం
డీఎంకే, ఎన్‌సీపీ (పవార్)
పార్టీల మద్దతుపై ఆశలు
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు కోసం రూపొందించిన కొత్త బిల్లును పార్లమెంటులో ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని నరేంద్రమోదీ సర్కారు పట్టుదలతో ఉంది. గత ఏప్రిల్‌లో ఈ బిల్లును ప్రతిపక్షాలు తిప్పికొట్టడంతో ఖంగు తిన్న అధికార పక్షం.. ఈసారి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈసారి ప్రతిపక్షాల ఆటకట్టించడం ఖాయమని, బిల్లును ఆమోదానికి అవసరమైన రెండింట మూడో వంతు మెజారిటీ కంటే ఎక్కువ ఆధిక్యాన్ని సంపాదించేందుకు రంగం సిద్ధం చేశామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభలో బీజేపీకి కేవలం 240 సీట్లే ఉన్నందున ఈ బిల్లు ఆమోదంలో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. దీంతో ఆయా పార్టీల మద్దతు కూడగట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆయన ఇప్పటికే పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడారని చెప్పాయి. బీజేపీ అగ్రనేతల పిలుపు మేరకు పలుమార్లు ఢిల్లీ వచ్చి డీలిమిటేషన్ బిల్లుపై చర్చలు జరిపిన చంద్రబాబు.. శుక్రవారం రాత్రి మరోసారి ఢిల్లీకి చేరుకున్నారు.
ఎన్‌డీఏ బలం ఇలా..
బీజేపీ- 240
టీడీపీ- 16
శివసేన(శిండే)- 13
జేడీయూ- 12
లోక్‌జనశక్తి (రాంవిలాస్)-5,
టీఎంసీ చీలిక వర్గం-20,
జేడీఎస్- 2
జనసేన- 2
ఆర్‌ఎల్‌డీ- 2
శిరోమణి అకాలీదళ్-1
అప్పాదళ్- 1
అసోం గణపరిషత్-1
అకాలీదళ్- 1
ఇతర పార్టీలు- 5
మొత్తం- 321
మద్దతు యత్నాలు ఫలిస్తే
డీఎంకే- 22
ఎన్సీపీ(ఎస్పీ)-8
వైసీపీ- 4
మొత్తం- 353
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..