సిక్కింలో వరదలకు ఆ గ్రామం ఖాళీ..!
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:26 AM
సిక్కింలో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా రాష్ట్రంలోని వెస్ట్ సిక్కింతో పాటు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, ఈ కొండచరియల్లో వెస్ట్ సిక్కిం జిల్లాలోని రింబి గ్రామం తీవ్రంగా ప్రభావితమైంది. ప్రస్తుతం ఈ గ్రామం నివాసయోగ్యం కాదని అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.
ఇంటర్‌నెట్ డెస్క్: సిక్కింలో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా రాష్ట్రంలోని వెస్ట్ సిక్కింతో పాటు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, ఈ కొండచరియల్లో వెస్ట్ సిక్కిం జిల్లాలోని రింబి గ్రామం తీవ్రంగా ప్రభావితమైంది. ప్రస్తుతం ఈ గ్రామం నివాసయోగ్యం కాదని అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. రింబి గ్రామంలో తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ గ్రామాన్ని నివాసయోగ్యంకాని గ్రామంగా ప్రకటిస్తామన్నారు. ఇటీవలే వచ్చిన వరదల కారణంగా గ్రామస్తులందరినీ రిలీఫ్ క్యాంపులకు తరలించామని చెప్పారు.
వరదల కారణంగా గ్రామంలోని మొత్తం 32 ఇండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, గ్రామంలో ఇంకా మట్టి, బురద అలాగే ఉందని వివరించారు. పక్కా ఇళ్లతో పాటు ఆర్‌సీసీ నివాసాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. వర్షాకాలం ముగిసిన తర్వాత త్వరలోనే రింబిలో జియోలాజికల్ సర్వే నిర్వహిస్తామని తెలిపారు. తరచూ కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలపై సర్వే చేస్తామని సిక్కిం విపత్తు నిర్వహణ కమిషనర్ రింజింగ్ చెవాంగ్ తెలిపారు. ఈనెల 25న ఇదివరకే రింబి గ్రామంలో సర్వే నిర్వహించామని ఆయన చెప్పారు. ఇక రింబి సమీపంలోని సింగ్లిటంలోనూ తొమ్మిది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆ గ్రామస్తులను కూడా రిలీఫ్ క్యాంపులకు తరలించామని వివరించారు. అలాగే, ఇప్పటిదాకా సురక్షితంగా భావించిన మీట్ ఖోలాలోనూ వరదలు సంభవించి ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్థానికులు చాలా మంది ఊరిని వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మరికొంతమంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు.
కొనసాగుతున్న సహాయక పనులు
సిక్కింలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బాధితులకు అవసరమైన వంట సామగ్రి, సరుకులు పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. పరిస్థితిపై ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సమీక్ష నిర్వహించారు. బాధితులకు సాయం అందడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపరాదని అధికారులను ఆయన ఆదేశించారు. వరదలు, కొండచరియల్లో ఇళ్లు పూర్తిగా నష్టపోయిన వారికి రూ.1.3 లక్షల పరిహారం అందించనున్నామని ఆయన తెలిపారు. అలాగే, సిక్కిం హౌసింగ్ స్కీం కింద బాధితులకు స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టిస్తామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు!
రేణిగుంట-అరక్కోణం మధ్య మరో రెండు లైన్లు
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..