కేరళంలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. ఐదుగురి మృతి, పలువురు గల్లంతు..
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:23 AM
కేరళంలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, బురద ప్రవాహాలు, ఆకస్మిక వరదలు సంభవించడంతో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు.
తిరువనంతపురం: కేరళంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, బురద ప్రవాహాలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. భారీ వర్షాలకు మలప్పురం జిల్లాలోని కొట్టపుళ నదికి వరదనీరు పోటెత్తింది. అయితే, ఆదివారం సాయంత్రం వాందూర్‌కు చెందిన ఐదుగురు స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. ఒక్కసారిగా ఆకస్మిక వరద రావడంతో ఐదుగురూ కొట్టుకుపోయారు.
వారిలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఒకరిని స్థానికులు ప్రాణాలతో కాపాడారు. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. మరోవైపు, కొట్టాయం జిల్లా వేలతుస్సేరి వద్ద ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న తమిళనాడుకు చెందిన సంగీత అరుల్ లాల్ (35) అనే మహిళ మృతి చెందగా.. ఆమె స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది. అలాగే, ఇడుక్కి జిల్లా కొట్టకంబూర్‌లో వర్షం కారణంగా నిన్న మధ్యాహ్నం ఓ షెడ్డులో తలదాచుకున్న ముగ్గురిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఓ మహిళ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు కేరళం ముఖ్యమంత్రి వి.డి.సతీసన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వర్షాల్లో చిక్కుకున్న వారికి సహాయం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు పరిస్థితిని అంచనా వేయడానికి విపత్తు నిర్వహణ అథారిటీ కమిషనర్ విఘ్నేశ్వరి.. ఇడుక్కి, కొట్టాయం జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఇడుక్కి, కొట్టాయం జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, మరికొన్ని గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. నేడో, రేపో ప్రొఫెసర్‌కి నోటీసులు..!
అతి వేగంతో అదుపు తప్పిన బీఎండబ్ల్యూ కారు