Share News

రాహుల్‌ నైతిక పతనానికి నిదర్శనం

ABN , Publish Date - Sep 21 , 2026 | 06:00 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ఒక వ్యంగ్య ప్రదర్శన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై బీజేపీ సీనియర్‌ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాహుల్‌ నైతిక పతనానికి నిదర్శనం
kiran and rahul

ఇండోర్‌ వ్యంగ్య ప్రదర్శనపై

మండిపడ్డ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 20: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ఒక వ్యంగ్య ప్రదర్శన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై బీజేపీ సీనియర్‌ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్‌ పార్టీ హాస్యకారులు, జోకర్ల పార్టీగా మారిపోయింది. వారు శాశ్వతంగా కనుమరుగయ్యారు.. రిప్‌’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. శనివారం ఇండోర్‌లో ‘ఛాత్రోన్‌కీ గూంజ్‌’ కార్యక్రమం జరిగింది. ఇందులో రాహుల్‌ సమక్షంలో స్టాండప్‌ కమెడియన్‌ పుల్కిత్‌ మణి ప్రధాని మోదీ ప్రసంగ శైలి, హావభావాలను అనుకరిస్తూ ఒక స్కిట్‌ చేశారు. విదేశీ నాయకులతో మోదీ మాట్లాడే శైలిని, ‘మై డియర్‌ ఫ్రెండ్‌’ అన్న పదాన్ని పదే పదే ఉపయోగిస్తూ హాస్యం పండించే ప్రయత్నం చేశారు. ‘‘హౌ ఆర్‌ యూ మై ఫ్రెండ్‌’’అని రాహుల్‌తో పుల్కిత్‌ మణి అనగా.. ‘హౌ ఆర్‌ యూ మోదీజీ’’అని రాహుల్‌ బదులిస్తారు. ‘‘గ్రేట్‌ హరా్‌సమెంట్‌’’ (వేధింపులు) అంటూ మణి పగలపడి నవ్వుతారు. ఒక బీజేపీ సభలో వృద్ధురాలైన మహిళ కోసం ప్రధాని మోదీ కుర్చీ ఏర్పాటు చేయాలని కోరిన ఘటనను కూడా ఈ స్కిట్‌లో అపహాస్యం చేశారు. దీన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ప్రదర్శనతో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నైతికత పాతాళానికి పడిపోయిందన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ.. మహిళలను, నారీశక్తిని అవమానించేలా ఈ ప్రదర్శన ఉందన్నారు. ఒకతల్లికి జరిగిన అవమానం చూసి నవ్వడం ద్వారా రాహుల్‌ గాంధీ తన రాజకీయ నేపథ్యాన్ని బట్టబయలు చేసుకున్నారని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా విమర్శించారు.

Updated Date - Sep 21 , 2026 | 06:00 AM