Beggar Foreign Currency: బిచ్చగాడి మరణం.. అతడి బ్యాగ్ ఓపెన్ చేసి పోలీసులు షాక్..
ABN , Publish Date - Jan 09 , 2026 | 10:16 AM
చనిపోయిన బిచ్చగాడి బ్యాగులో పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ నోట్లు దొరికాయి. అనిల్ బ్యాగులో ఉన్న మొత్తం డబ్బు విలువ రూ.4.50 లక్షలుగా తేలింది. అధికారులు అనిల్ కుటుంబ సభ్యుల కోసం వెతకటం మొదలెట్టారు..
ఓ బిచ్చగాడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు అతడి బ్యాగ్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. అందులో ఏకంగా రూ.4.50 లక్షల నగదు బయటపడింది. వాటిలో ఫారిన్ కరెన్సీ కూడా ఉండటం పోలీసులను ఆశ్చర్య పరిచింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళ, ఆలప్పుళలోని చారుమూటు ఏరియాకు చెందిన అనిల్ కిషోర్ అనే వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. అతడు సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. స్కూటర్‌పై వెళ్తున్న అతడ్ని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అనిల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే, అనిల్ అదే రోజు రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం కడత్తినాల్ ఏరియాలోని షాపు దగ్గర శవమై కనిపించాడు. అనిల్ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మృతుడు అనిల్‌కు చెందిన బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ బ్యాగును తెరిచి చూసి షాక్ అయ్యారు. బ్యాగులో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి. వాటిలో పాత వెయ్యి, 500 నోట్లు కూడా ఉన్నాయి.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బిచ్చగాడి బ్యాగులో పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ నోట్లు కూడా దొరికాయి. అనిల్ బ్యాగులో ఉన్న మొత్తం డబ్బు రూ.4.50 లక్షలగా తేలింది. అధికారులు అనిల్ కుటుంబసభ్యుల కోసం వెతకటం మొదలెట్టారు. ఇక, బిచ్చగాడి బ్యాగులోని డబ్బుల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఆ డబ్బుల్ని చూసి నోరెళ్ల బెడుతున్నారు. ‘బిచ్చగాడి బ్యాగులో అంత డబ్బా’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇవి కూడా చదవండి..
రాయచోటి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నారా లోకేష్..
సంక్రాంతికి ఊరెళ్తే.. సమాచారమివ్వండి..